అది టోక్యో. అక్కడ ఓ వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నాడు. వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి వెళ్లాడు. కానీ... అతడ్ని చేర్చుకునేందుకు అక్కడి సిబ్బంది నిరాకరించారు. చేసేది లేక... అదే అంబులెన్స్‌లో మరో ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడా అదే పరిస్థితి. అలా ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 80 ఆస్పత్రులు తిరిగాడు. ఏ చోటా అతడికి చేరేందుకు అనుమతి లభించలేదు. ప్రాణాపాయ పరిస్థితుల్లోనే అలా తిరుగుతూ నగర శివార్లకు చేరుకున్నాడు ఆ రోగి. చివరకు ఓ ఆస్పత్రిలో చేరాడు.
మరో వ్యక్తికి ఇదే పరిస్థితి ఏర్పడింది. 40 ఆసుపత్రులు అతడికి చికిత్స చేసేందుకు నిరాకరించాయి.
నెలలో 931 సార్లు..
మార్చిలో 931 సార్లు ఆంబులెన్సులను 5 కన్నా ఎక్కువ ఆసుపత్రులు తిరస్కరించిన ఘటనలు జరిగాయి. వీరంతా అత్యవసర సేవలు పొందేందుకు కనీసంగా 20 నిమిషాలు పట్టినట్లు అంచనా. ఏప్రిల్ నెలలో తొలి 11 రోజుల్లోనే 830 ఘటనలు జరిగినట్లు టోక్యో అగ్నిమాపక శాఖ తెలిపింది.
ఎందుకు ఇలా? అన్ని రంగాల్లో ఎంతో ముందు ఉందని చెప్పుకునే జపాన్ రాజధానిలోనే ఎందుకింతటి దుస్థితి? సమాధానం ఒక్కటే... కరోనా విజృంభణ.
లాక్డౌన్ అమలు చేస్తున్నా జపాన్‌లో ఆందోళనకర స్థాయిలో వ్యాపిస్తోంది రాకాసి వైరస్. ఫలితంగా అక్కడి వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. చాలా ఆసుపత్రులు అత్యవసర సేవలను నిలిపివేశాయని జపాన్ వైద్య సంఘాలు తెలిపాయి. గుండెపోటు వంటి తీవ్రమైన కేసులనూ స్వీకరించట్లేదని వెల్లడించాయి.