రెండు నెలల నుంచి కొవిడ్-19(కరోనా).. చైనాను వణికిస్తూనే ఉంది. చైనాతో పాటు మొత్తం 66 దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3 వేల మంది మరణించగా అందులో ఒక్క చైనాలోనే 2870 మంది మృతి చెందారు. వైరస్ బారినపడిన వారి సంఖ్య 88 వేలకు పైమాటే. వీరిలో చైనాకు చెందిన వారు 79,284 మంది ఉన్నారు. 3736 మందితో తర్వాత స్థానంలో నిలిచింది దక్షిణ కొరియా. ఇరాన్లో 978, జపాన్లో 961, సింగపూర్లో 106 కేసులు నమోదయ్యాయి.
చైనా తర్వాత అత్యధికంగా ఇరాన్లో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీ (34), దక్షిణకొరియా (20), హాంకాంగ్ (2), ఫ్రాన్స్ (2) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అమెరికా, థాయిలాండ్, తైవాన్, యూకే దేశాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు ఆయా దేశాలు స్పష్టం చేశాయి.
కరోనా బాధిత దేశాల జాబితాలోకి నూతనంగా మరికొన్ని దేశాలు చేరుతున్నాయి. తాజాగా డొమినికన్ రిపబ్లిక్లో తొలి కరోనా కేసు నమోదైంది. నెదర్లాండ్స్, ఈస్టోనియా, ఈక్వెడార్, అర్మేనియా దేశాల్లోనూ వైరస్ వ్యాపించినట్లు ఆయా దేశాలు ప్రకటించాయి.
ఇటలీలో...
ఇటలీలో 1,576 కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆధికారులు ప్రకటించారు. మొత్తంగా అక్కడ 34 మంది కరోనాకు బలయ్యారు. ఆదివారం ఒక్కరోజే ఐదుగురు మరణించినట్లు వెల్లడించారు. కేవలం 24 గంటల్లోనే 40 శాతం కేసులు అధికమైనట్లు తెలిపారు. ఆస్ట్రేలియాలోనూ తొలి కరోనా మరణం నమోదైంది.
జర్మనీలో...
జర్మనీలో శనివారం వరకు 66 కేసులు నమోదవ్వగా.. ఈ సంఖ్య ఆదివారం రెండింతలు పెరిగి 129కి చేరినట్లు అధికారులు స్పష్టం చేశారు. మొత్తం 16 రాష్ట్రాలున్న జర్మనీలో మహమ్మారి 9 రాష్ట్రాలకు వ్యాపించినట్లు పేర్కొన్నారు.