చైనాలో కలకలం సృష్టిస్తోన్న అతిభయంకరమైన కరోనా వైరస్ ధాటికి మరొకరు బలయ్యారు. తాజా మరణంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. వుహాన్ పట్టణంలో తొలిసారి గుర్తించిన ఈ వైరస్ ఆసియాలోని మూడో దేశానికి విస్తరించినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటికే థాయిలాండ్, జపాన్ దేశాలకు సోకిన ఈ వ్యాధికారక వైరస్ తాజాగా దక్షిణ కొరియాకు చేరింది. వుహాన్ పట్టణం నుంచి వచ్చిన 35 ఏళ్ల మహిళ శరీరంలో వైరస్‌ను గుర్తించినట్లు దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు. జపాన్, థాయిలాండ్ దేశాల్లో మొత్తం మూడు కేసులు నమోదు కాగా... వారందరూ చైనాలోని వుహాన్ పట్టణం నుంచే ఆయా దేశాలకు వెళ్లారు.
మరోవైపు వుహాన్‌లో ఈ వైరస్ అంతకంతకూ వ్యాపిస్తోంది. ఈ వారాంతంలో 136 కొత్త కేసులు నమోదైనట్లు స్థానిక వైద్య అధికారులు తెలిపారు. దీంతో మొత్తం వైరస్ సోకిన వారి సంఖ్య 220కి చేరింది.
భారత్ అప్రమత్తం
చైనాలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోన్న తరుణంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. 2019 డిసెంబర్ 31 నుంచి భారతదేశ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను అందజేయాలని.. విదేశాంగ శాఖను వైద్య ఆరోగ్య శాఖ కోరింది. వుహాన్ పట్టణం నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికుల జాబితా అందించాలని ఆదేశించింది.
దీంతోపాటు ప్రయాణికులకు మార్గదర్శకాలు జారీ చేయాలని చైనాలోని భారత రాయబార కార్యాలయాలను విదేశాంగ శాఖ ఆదేశించినట్లు వైద్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రాబోయే పరిణామాలను ఎదుర్కోవడానికి తమ సంసిద్ధతను సమీక్షించుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖ రాశారు.
సార్స్ లక్షణాలే దీనికీ
2002-03లో చైనా, హాంకాంగ్ ప్రాంతాల్లో వ్యాపించిన సార్స్ వైరస్ లక్షణాలు తాజాగా విస్తరిస్తోన్న వైరస్‌కు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అప్పట్లో ఈ సార్స్ వైరస్ కారణంగా 650 మంది మృతి చెందారు.
ఇదీ చదవండి: రోడ్ షోకే సమయం సరి.. ముఖ్యమంత్రి నామినేషన్ వాయిదా