కరోనా మహమ్మారితో ఇప్పటికే ప్రపంచమంతా బెంబేలెత్తిపోతుంటే.. చైనా పరిశోధకులు మరో చేదు విషయం చెప్పారు. రాబోయే కాలంలో మహమ్మారిగా మారే ప్రమాదం ఉన్న మరో వైరస్‌ను గుర్తించినట్లు తెలిపారు. ఈ మేరకు అమెరికాకు చెందిన 'ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్' జర్నల్‌లో వారి పరిశీనలను ప్రచురించారు.
ఏంటీ కొత్త వైరస్..
ఇప్పుడు పరిశోధకులను కలవరానికి గురిచేస్తున్న ఈ వైరస్‌కు జీ-4గా నామకరణం చేశారు. 2009లో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన హెచ్1ఎన్1 వైరస్ జాతి నుంచే ఇది ఉద్భవించినట్లు పరిశోధకులు గుర్తించారు. "మనుషులకు సోకడానికి అవసరమయ్యే లక్షణాలన్నీ ఈ వైరస్‌లో ఉన్నట్లు గుర్తించాం" అని అధ్యయనంలో పాల్గొన్న చైనాలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు, చైనా 'వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం'(సీడీసీ) శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇలా గుర్తించారు..
2011 నుంచి 2018 మధ్య చైనాలోని పది రాష్ట్రాల్లో ఉన్న వివిధ జంతువధశాలలు, పశువైద్యశాలల్లో ఉన్న పందుల నుంచి దాదాపు 30 వేల నమూనాలను సేకరించారు. ప్రస్తుతం కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షల్లో తీసుకుంటున్నట్లుగా నమూనాలను పందుల ముక్కుల్లో నుంచే తీసుకున్నారు. అనంతరం వాటిపై పరిశోధనలు జరపగా.. దాదాపు 179 రకాల స్వైన్ ఫ్లూ వైరస్‌లను కనుగొన్నారు. వీటితో ఫెర్రెట్ అనే ముంగిస జాతికి చెందిన జంతువుపై ప్రయోగాలు చేశారు. వైరస్‌లు సోకినప్పుడు మనుషుల్లో కనబడే లక్షణాలే దాదాపు ఫెర్రెట్‌లోనూ కనిపిస్తుంటాయి. అందుకే ఫెర్రెట్‌పై ప్రయోగాలు జరుపుతుంటారు. కొత్తగా కనుగొన్న వైరస్‌లన్నింటిలోకెల్లా జీ-4 వైరస్ ఫెర్రెట్‌లో ప్రమాదకర లక్షణాలు చూపినట్లు పరిశోధకులు గుర్తించారు. అలాగే మానవ కణాల్లోనే ఇది వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు గమనించారు.