కొవిడ్-19 నివారణకు డీఎన్ఏ ఆధారిత టీకాను తైవాన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఎలుకలపై దీన్ని ప్రయోగించినప్పుడు కరోనా వైరస్‌ను నిర్వీర్యం చేసే యాంటీబాడీలు ఉత్పత్తయ్యాయని, పైగా అవి దీర్ఘకాలం కొనసాగాయని వెల్లడైనట్లు వారు తెలిపారు.
ఆర్ఎన్ఏ ఆధారంగా..
వైరస్లలో ఆర్ఎన్ఏ లేదా డీఎన్ఏ జన్యు పదార్థం ఉంటుంది. కొవిడ్ కారక సార్స్-కోవ్-2 వైరస్లలో ఆర్ఎన్ఏ ఉంది. కరోనా నుంచి రక్షణ కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న కొన్ని టీకాలు మెసెంజర్ ఆర్ఎన్ఏ(ఎంఆర్ఎన్ఏ) పోగుల ఆధారంగా పనిచేస్తాయి. అవి కరోనా వైరస్‌ను గుర్తించేలా మానవ నిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తాయి. అందుకు భిన్నంగా తాజాగా తైవాన్‌లోని నేషనల్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ శాస్త్రవేత్తలు ఈ మహమ్మారికి డీఎన్ఏ టీకాను అభివృద్ధి చేశారు. వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్ సంకేతంతో కూడిన డీఎన్ఏను ఇందులో ఉపయోగించారు.
డీఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ టీకాల్లో.. వైరస్‌లోని జన్యు పదార్థ సంకేతం ఉంటుంది. దీని ఆధారంగా మానవ రోగనిరోధక వ్యవస్థ స్పందిస్తుంది. హెచ్ఐవీ-1, జికా, ఎబోలా, ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లపై డీఎన్ఏ వైరస్లు సురక్షితంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ప్రయోగాల్లో తేలింది. డీఎన్ఏ టీకాలను మానవ కణాల్లోకి బట్వాడా చేయటం కొన్నిసార్లు కష్టమవుతుంది. ఎలక్ట్రోపొరేషన్ విధానంతో ఈ ఇబ్బందిని తైవాన్ శాస్త్రవేత్తలు అధిగమించారు. ఎలుకలపై ఈ టీకాను ప్రయోగించినప్పుడు కరోనా వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్ ను లక్ష్యంగా చేసుకునే యాంటీ బాడీలు ఉత్పత్తయినట్లు గుర్తించారు. టీకా పొందిన 8 వారాల తర్వాత కూడా అవి అధిక స్థాయిలోనే కొనసాగినట్లు వివరించారు.
హోమ్స్టర్ ఎలుకలపై..
హోమ్స్టర్ అనే ఒక రకం మూషికాలను మూడు వారాల విరామంతో రెండు డోసులు ఇచ్చారు. ఏడు వారాల తర్వాత వాటిని కొవిడ్-19కు గురిచేశారు. టీకా కారణంగా అవి వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొన్నట్లు తేల్చారు. ఇన్ఫెక్షన్ కారణంగా వాటి శరీర బరువు తగ్గలేదని, టీకా పొందని ఇతర హోమ్స్టర్లతో పోలిస్తే వీటి ఊపిరితిత్తుల్లో వైరల్ ఆర్ఎన్ఏ చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. డీఎన్ఏ టీకాల రవాణాకు శీతల సాధనాలు అవసరం లేదని కూడా నిపుణలు చెప్పారు.