నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించే... కమ్యూనిస్టు పార్టీ (ఎన్సీపీ) స్టాండింగ్ కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడింది. ఇలా వాయిదా పడడం దీనితో ఐదోసారి.
"దేశంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమాయత్తమైన పార్టీ... సహాయక చర్యల్లో నిమగ్నమైంది. అందువల్లనే స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని వారం పాటు వాయిదా వేశాం."
- నారాయణ్ కాజీ శ్రేష్ఠ, ఎన్సీపీ అధికార ప్రతినిధి
45 మంది సభ్యులు గల నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ సాండింగ్ కమిటీ భేటీ శుక్రవారం జరగాల్సి ఉంది.
ఓలి భవితవ్యం?
నేపాల్ ప్రధాని ఓలి.. ఇటీవలి కాలంలో తరచుగా భారత వ్యతిరేక చర్యలు చేపడుతున్నారు. సొంత పార్టీ నేతలే ఈ అంశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ఆయన నాసిరకపు పనితీరుపైనా పార్టీలో అసమ్మతి పెరిగిపోతోంది. ఫలితంగా.. ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తూ స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రచండతో రాజీ..?
అధికారాన్ని పంచుకునే విషయంలో ఓలికి, ఎన్సీపీ అధ్యక్షుడు పుష్ప కమల్ దహల్ ప్రచండకు మధ్య వివాదం కొనసాగుతోంది. భారత్ పట్ల ఓలి అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పుపడుతున్నారు. దీనితో వారిద్దరి మధ్య రాజీ కుదర్చడానికి చైనా తెరవెనుక పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి:సౌర విద్యుత్ వేలంలో భారత్ భేష్: గుటెరస్