నేపాల్లోని అధికార కమ్యునిస్టు పార్టీలో ముదిరిన అభిప్రాయబేధాలు సమసిపోయినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి, పార్టీ కీలక నేత పుష్ప కమల్ దహాల్ 'ప్రచండ' మధ్య అధికార పంపిణీ విషయంలో ఒప్పందం కుదిరినట్లు సీనియర్ పార్టీ నేతలు వెల్లడించారు. నెలల తరబడి సాగిన ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడినట్లు తెలిపారు. 13 మంది సభ్యులతో కూడిన పార్టీ స్టాండింగ్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ దిశగా పురోగతి సాధించినట్లు స్పష్టం చేశారు.
పార్టీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా ప్రచండ సేవలందిస్తారని, పార్టీకి సంబంధించి పూర్తి స్థాయి అధికారాలు ఆయన చేతిలో ఉంటాయని నేపాల్ కమ్యునిస్టు పార్టీ ప్రతినిధి నారాయణ్ కాజీ శ్రేష్ఠ తెలిపారు. మరోవైపు ప్రభుత్వ వ్యవహారాలను ఓలి నడిపిస్తారని వెల్లడించారు. జాతీయ ప్రాధాన్యత ఉన్న విషయాల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు పార్టీని సంప్రదించాలని అంగీకారానికి వచ్చినట్లు శ్రేష్ఠ వెల్లడించారు. రోజువారీ ప్రభుత్వ వ్యవహారాల్లో మాత్రం పార్టీ నాయకత్వం జోక్యం చేసుకోదని తెలిపారు.
భారత్తో సరిహద్దు సమస్యను రాజకీయ, దౌత్యపరమైన మార్గాల్లో పరిష్కరించుకునేందుకు సైతం భేటీలో నిర్ణయించినట్లు స్పష్టం చేశారు శ్రేష్ఠ.