విదేశాల నుంచి వచ్చిన అనుమానాస్పద సొమ్మును బదిలీ చేయడంలో నేపాల్‌లోని కొన్ని బ్యాంకులు, సంస్థల పాత్ర ఉన్నట్లు వెల్లడైంది. సెంటర్ ఫర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం(సీఐజే), ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) సంయుక్తంగా నిర్వహించిన దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇరాన్, చైనా వాణిజ్యంపై అమెరికా ఆంక్షలను తప్పుదారి పట్టించేందుకు నేపాల్ బ్యాంకులు ప్రయత్నించినట్లు ఈ దర్యాప్తులో తేలింది.
ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించే ప్రభుత్వ సంస్థ 'ఫైనాన్సియల్ క్రైమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్' రూపొందించే రహస్య పత్రాల ఆధారంగా ఈ దర్యాప్తు నిర్వహించారు. ఈ దర్యాప్తు నివేదికకు 'ఫిన్సెన్ ఫైల్స్'గా నామకరణం చేశారు.
"బంగారం, పురాతన వస్తువులు, టెలికమ్యునికేషన్ పరికరాల అంతర్జాతీయ స్మగ్లింగ్లతో నేపాల్‌కు చెందిన కొన్ని వ్యాపారాలకు సంబంధం ఉంది. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ప్రైమ్ కమర్షియల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ కాఠ్మాండూ, నేపాల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఎవరెస్ట్ బ్యాంక్, మెగా బ్యాంక్, హిమాలయన్ బ్యాంక్, అపెక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ కస్కి, నేపాల్ బంగ్లాదేశ్ బ్యాంక్‌లు అనుమానాస్పదంగా నగదు బదిలీలో పాల్గొన్న బ్యాంకుల జాబితాలో ఉన్నాయి."
-ఫిన్సెన్ ఫైల్స్
అనుమానాస్పద నిధుల బదిలీలో పది నేపాలీ సంస్థలకు నేరుగా ప్రమేయం ఉందని ఫిన్సెన్ ఫైల్స్ పత్రాలు పేర్కొన్నాయి. ఈ కంపెనీలు, బ్యాంకుల ద్వారా 11 ఏళ్లలో 292.7 మిలియన్ డాలర్ల నిధుల బదిలీ జరిగిందని తెలిపాయి.
రవునియార్ బ్రదర్స్ అండ్ కంపెనీ, సుభా సమృద్ధి ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్, శాస్తా ట్రేడింగ్ కంపెనీ, సేతీదేవి ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్డీ. ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ఫెల్ట్ అండ్ యార్న్ ప్రైవేట్ లిమిటెడ్, ఉమెన్స్ పేపర్ క్రాఫ్ట్స్, ఆక్మే మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్, సన్నీ ఎంటర్ప్రైజెస్లపై అనుమానాస్పద లావాదేవీలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
"పెట్రోలియం తదితర ఉత్పత్తులను ఎగుమతి చేసే దుబాయ్‌కి చెందిన 'కైట్ ఇంటర్నేషనల్ ఎఫ్‌జడ్‌ఈ' సంస్థ ద్వారా రవునియార్ బ్రదర్స్, శుభ సమృద్ధి ట్రేడర్స్ కంపెనీలు అనుమానిత లావాదేవీలు నిర్వహించాయి. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతుల పేరిట నాలుగేళ్లలో(2010-2014 మధ్య) 71.4 మిలియన్ డాలర్లను వివిధ దేశాలకు పంపించాయి."
-ఫిన్సెన్ ఫైల్స్
అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్ నుంచి రవునియర్ కంపెనీ పలు ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నట్లు ఫిన్సెన్ పత్రాలు పేర్కొన్నాయి. ఈ ఉత్పత్తులను దుబాయ్ నుంచి దిగుమతి చేసుకున్నట్లు, పత్రాలను ఫోర్జరీ చేశారని తెలిపాయి. దర్యాప్తు సమయంలో ఈ విషయంపై కైట్ సంస్థ స్పందన కోసం ప్రయత్నించినప్పటికీ.. వారి నుంచి ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదని వెల్లడించాయి.
కెన్యా, జాంబియా, మొజాంబిక్, నేపాల్, అమెరికాలో 'కైట్ ఇంటర్నేషనల్'కు శాఖలున్నట్లు జర్నలిస్ట్‌లు గుర్తించారని నివేదిక వెల్లడించింది. ఉన్నత విద్య కోసం నేపాల్‌లో కొత్త ప్రాజెక్టును ప్రారంభించినట్లు వారు తెలుసుకున్నారని పేర్కొంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక రికార్డులు లేవని తెలిపింది.