తెలంగాణ

telangana

ETV Bharat / international

'దౌత్య చర్చలతోనే కాలపానీ సమస్యకు పరిష్కారం' - భారత్ చైనా సంబంధాలు

భారత్​తో సరిహద్దు సమస్యలను దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకుని తమ భూభాగాలను తిరిగి పొందుతామని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ తెలిపారు. చారిత్రక పత్రాలు, వాస్తవాల ఆధారంగా భారత్​తో చర్చిస్తామని పేర్కొన్నారు.

NEPAL-INDIA-OLI
కాలపానీ సమస్య

By

Published : Jun 11, 2020, 7:38 PM IST

కాలపానీ సమస్యను దౌత్య మార్గంలోనే పరిష్కరించుకుంటామని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ స్పష్టం చేశారు. చారిత్రక వాస్తవాలు, పత్రాల ఆధారంగా చర్చలు జరిపి తమ భూభాగాలను తిరిగి పొందుతామని తెలిపారు. ఆ దేశ పార్లమెంటులో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాలను వెల్లడించారు ఓలీ.

"భారత్​తో చర్చల ద్వారా మా భూభాగాలను తిరిగి పొందుతాం. కాళీ ఆలయాన్ని నిర్మించి కృత్రిమ కాళీ నదిని సృష్టించింది భారత్​. కాలపానీలో సైన్యాన్ని మోహరించి నేపాల్ భూభాగాలను ఆక్రమించింది."

- కేపీ శర్మ ఓలీ, నేపాల్ ప్రధాని

రహదారి ప్రారంభంతో..

భారత్​కు వ్యూహాత్మకంగా కీలకమైన రహదారిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మే 8న ప్రారంభించిన తరువాత భారత్, నేపాల్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 80 కి.మీ పొడవైన ఈ రహదారి ఉత్తరాఖండ్‌లోని ధార్చులాతో లిపులేఖ్ కనుమను అనుసంధానిస్తుంది.

రహదారి ప్రారంభోత్సవంపై నేపాల్ తీవ్రంగా స్పందించింది. ఇది నేపాల్ భూభాగం నుంచి వెళుతుందని పేర్కొంది. ఈ ప్రాంతం 1962కు ముందు నేపాల్​ అధీనంలోనే ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. చైనాతో యుద్ధ సమయంలో ఈ తాత్కాలిక అవసరాల కోసం ఈ ప్రాంతంలో భారత్ బలగాలను మోహరించి.. అలాగే కొనసాగించారని ఆరోపించారు.

కొత్త మ్యాపునకు ఆమోదం..

కాలాపానీ, లిపులేఖ్​, లింపియాధురాలను తమ భూభాగంలోనివిగా నేపాల్​ వాదనలకు దిగింది. అంతేకాకుండా ఈ ప్రాంతాలను తమ భూభాగంలో కలిపి కొత్త జాతీయ పటాన్ని రూపొందించింది. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణకు ఆ దేశ పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత నేపాల్ జాతీయ చిహ్నంలోనూ ఇదే మ్యాప్​ కనిపిస్తుంది.

యోగి సూచనలపైనా..

టిబెట్ చేసిన తప్పు నేపాల్​ చేయవద్దని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ చేసిన సూచనలపైనా ఓలీ స్పందించారు. యోగి ఈ విషయాలపై మాట్లాడటం సముచితం కాదని పేర్కొన్నారు.

"నేపాల్​ను ఈ విధంగా హెచ్చరించటం సముచితం కాదు. యూపీ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదు. ఇది విచారకరం." అని ఓలీ వ్యాఖ్యానించారు.

ఈపీజీ నివేదిక..

భారత్​, నేపాల్​కు సంబంధించి ఎమినెంట్​ పర్సన్స్​ గ్రూప్ (ఈపీజీ) రూపొందించిన సంయుక్త నివేదికను స్వీకరించేందుకు భారత్ సిద్ధంగా లేదని ఓలీ ఆరోపించారు. నేపాల్​ సిద్ధంగానే ఉన్నప్పటికీ.. రెండు ప్రభుత్వాలు స్వీకరించనిదే దీనికి అర్థం లేదని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:సరిహద్దు సమస్యకు సామరస్యంగానే పరిష్కారం: చైనా

ABOUT THE AUTHOR

...view details