నేపాల్ ప్రధానమంత్రి ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి భవితవ్యం శనివారం తేలనుంది. జులై 4న జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఓలి ప్రధానమంత్రి పదవిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని రాజీనామా కోసం డిమాండ్లు ఎక్కువైన నేపథ్యంలో తాజా పరిణామాలు ఆకస్తికరంగా మారాయి.
ప్రధానమంత్రి ఓలి రాజీనామాపై ఏకాభిప్రాయం కల్పించడంలో పార్టీ ఉన్నతాధికారులు విఫలమైన నేపథ్యంలో గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశాలను వాయిదా వేశారు.
ఓలి రాజీనామా చేయాల్సిందేనని గురువారం నుంచి పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ఓలి చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని స్పష్టం చేశారు.
"ప్రధాని పదవి నుంచి తొలగించడానికి భారత్ కుట్రచేస్తోందన్న ఓలి వ్యాఖ్యలు దౌత్యపరంగా, రాజకీయంగా సరైనవి కావు. వ్యూహాత్మకంగా కీలకమైన భారత భూభాగాలైన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలతో దేశ మ్యాప్‌ను నవీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయం తర్వాత కొంత మంది నేపాల్ రాజకీయ నేతలు ఓలితో భాగస్వామ్యమయ్యారు. పార్టీ నాయకులతో పాటు పొరుగుదేశాలపై ఆరోపణలు చేయడం సరైనది కాదు."
-పుష్ప కమల్ దహాల్ (ప్రచండ), నేపాల్ కమ్యునిస్టు పార్టీ ఛైర్మన్
పార్టీకీ, ప్రభుత్వానికి సమన్వయం లేదని ప్రచండ అభిప్రాయపడుతున్నట్లు నేతలు చెబుతున్నారు. పార్టీ అనుసరిస్తున్న ఒక వ్యక్తి ఒకే హోదా విధానాన్ని అందరూ అనుసరించేలా ఆయన ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. గురువారం జరగాల్సిన పార్లమెంట్ సమావేశాలను ఓలి రద్దు చేయడం వల్ల పార్టీలోని రెండు వర్గాల మధ్య అభిప్రాయభేదాలు మరింత పెరిగిపోయాయన్నారు.
ఉమ్మడి విధానం
ఈ నేపథ్యంలో శనివారం జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో రెండు వర్గాలు ఓ విధానాన్ని రూపొందించుకునే అవకాశం ఉందని పార్టీ నేత గణేష్ షా తెలిపారు. పార్టీతో పాటు ప్రభుత్వం అనుసరించడానికి ఈ విధానాలు రూపొందించడం ద్వారా ఈ భేదాలు తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
"ప్రధానమంత్రి ఓలి ఏకపక్షంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. పార్టీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ప్రచండను స్వయంగా పనిచేయడానికి ఆయన అనుమతించడం లేదు."