నేపాల్ ప్రధానమంత్రి ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి భవితవ్యం తేల్చే అధికార కమ్యూనిస్టు పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడింది. ఇవాళ జరగాల్సిన సమావేశాన్ని ఆదివారానికి వాయిదా వేస్తున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఓలి, ప్రచండ అభ్యర్థన మేరకు ఆదివారం 3 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపాయి. ఈ సమావేశం వాయిదా పడటం ఇది ఐదోసారి కావడం గమనార్హం.
నిజానికి స్టాండింగ్ కమిటీ సమావేశం ఇవాళ ఉదయం 11 గంటలకు జరగాల్సి ఉంది. అయితే ఓలి, ప్రచండ మధ్య చివరి నిమిషంలో చర్చలు జరుపుకునేందుకు వీలుగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. చివరకు సమావేశ తేదీని ఆదివారానికి మార్చారు.
సీడబ్ల్యూసీ మీటింగ్ కూడా
మరోవైపు 441 సభ్యులు ఉన్న కేంద్ర కార్యవర్గ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశాన్ని త్వరలో నిర్వహించనున్నట్లు స్టాండింగ్ కమిటీ సభ్యుడు గణేష్ షా తెలిపారు. వచ్చే వారం ఈ సమావేశం జరిగే అవకాశం ఉందన్నారు. సమావేశ తేదీని ఆదివారం జరిగే స్టాండింగ్ కమిటీ భేటీలో ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి ఓలి భవిష్యత్తును తేల్చనున్నట్లు చెప్పారు.
"ప్రచండ నేతృత్వంలోని అసమ్మతి బృందం డిమాండ్ ప్రకారం పార్టీలో 'ఒక వ్యక్తి- ఒకే పదవి' విధానం అమలుపై నిర్ణయం తీసుకునే అధికారం సీడబ్ల్యూసీకి ఉంది."
-గణేష్ షా, స్టాండింగ్ కమిటీ సభ్యుడు
ఫలించని చర్చలు!
స్టాండింగ్ కమిటీ సమావేశం నేపథ్యంలో ప్రధాని ఓలి, పార్టీ కో-ఛైర్మన్ పుష్ప కుమార్ దహాల్(ప్రచండ) శుక్రవారం అనధికార చర్చలు జరిపారు. తమ మధ్య ఏర్పడిన అభిప్రాయభేదాలకు పరిష్కారం కనుగొనే దిశగా సమాలోచనలు జరిపారు.
గురువారం సైతం ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ప్రధాని అధికారిక నివాసంలో జరిగిన భేటీలో మాజీ ప్రధాని మాధవ్ కుమార్ నేపాల్ సైతం పాల్గొన్నారు. అయితే ఇందులో ప్రధాని ఓలి మొండిపట్టు పట్టినట్లు తెలుస్తోంది. ప్రధాని పదవితో పాటు, పార్టీ ఛైర్మన్ పదవిని వదులుకునేందుకు విముఖత చూపినట్లు సమాచారం. ఒక వ్యక్తి- ఒకే పదవి నిబంధనకు ప్రధాని ఒప్పుకోని కారణంగా చర్చలు విఫలమవుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ఏకపక్షంగా వాయిదా వేయడం వల్ల ఓలి, ప్రచండ వర్గాల మధ్య అభిప్రాయభేదాలు అధికమయ్యాయి. అధికార విభజన కోసం ప్రచండ వర్గం పట్టుబడుతోంది. తనను పదవిలో నుంచి దించేయడానికి దక్షిణాన ఉన్న పొరుగుదేశంతో కలిసి కొందరు అధికార పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఓలి ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ప్రచండ సహా నేపాల్ కమ్యూనిస్టు పార్టీ నేతలందరూ ప్రధాని పదవికి ఓలి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారత్కు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలు రాజకీయంగా, దౌత్యపరంగా సరైనవి కావని ఓలికి హితవు పలికారు. ఆరోపణలకు సరైన ఆధారాలు చూపాలని స్పష్టం చేశారు. ఓలి నిరంకుశ పాలనపైనా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గత శుక్రవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరగాల్సి ఉండగా.. దేశంలో వరదల సంభవిస్తున్నాయన్న కారణంగా నాలుగోసారి సమావేశాన్ని వాయిదా వేశారు.