భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపాల్ మరోసారి దుందుడుకుగా వ్యవహరించింది. ఇరుదేశాల మధ్య ఉన్న ఓ తటస్థ ప్రాంతాన్ని (నో మ్యాన్స్ లాండ్) తన భూభాగంగా చూపించుకునే ప్రయత్నం చేసింది. అయితే ఎస్ఎస్బీ సిబ్బంది జోక్యంతో వెనక్కి తగ్గింది.
ఫ్రెండ్షిప్...!
నేపాల్ పోలీసులు మంగళవారం బిర్గుంజ్ - బిహార్లోని రక్సాల్ ప్రాంతాన్ని కలిపే మైత్రేయి (ఫ్రెండ్షిప్) వంతెనపై బోర్డు ఏర్పాటు చేశారు. ఈ బోర్డులో 'నేపాల్ పార్సా జిల్లాలోని బిర్గుంజ్ పట్టణ భూభాగం ఈ వంతెన నుంచే ప్రారంభమవుతుంది' అని ఉంది. ఇందులోనే స్థానిక నేపాల్ అధికారుల ఫోన్ నెంబర్ కూడా ఉంది.
స్థానిక బిహార్ ప్రజలు నేపాల్ చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు. విషయం తెలుసుకున్న ఎస్ఎస్బీ సిబ్బంది రంగంలోకి దిగారు. దీనితో వెనక్కి తగ్గిన నేపాల్ పోలీసులు... ఆ బోర్డును తొలగించారు.
ఎస్ఎస్బీ సిబ్బంది కఠిన వైఖరి ప్రదర్శించిన తరువాతే నేపాల్ పోలీసులు... వంతెనపై ఏర్పాటుచేసిన బోర్డును తొలగించినట్లు స్థానికులు తెలిపారు.