తెలంగాణ

telangana

ETV Bharat / international

రాష్ట్రపతితో ప్రధాని భేటీ.. రాజీనామా చేస్తారా? - oli meets nepal president

KP Sharma Oli
కేపీ శర్మ ఓలి

By

Published : Jul 2, 2020, 12:10 PM IST

Updated : Jul 2, 2020, 1:14 PM IST

12:04 July 02

రాష్ట్రపతితో ప్రధాని భేటీ.. రాజీనామా కోసమేనా?

నేపాల్​లో రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. తాజాగా రాష్ట్రపతి బైద్యదేవి భండారిని కలిసేందుకు ప్రధాని కేపీ శర్మ ఓలి.. శీతల్​ నివాస్​కు వెళ్లారు. అనంతరం జాతినుద్దేశించి ఓలి ప్రసంగిస్తారని ప్రధాని కార్యాలయ వర్గాల సమాచారం. ఈ పరిణామాలతో ఓలి రాజీనామా చేయనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.  

పదవికి రాజీనామా చేయాలని సొంత పార్టీ నేతలు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. పార్టీలో చీలికలు మొదలయ్యాయనే వార్తల నడుమ కేబినెట్ మంత్రులతో సహా నమ్మకస్థులతో బుధవారం సమావేశం నిర్వహించారు ఓలీ.  

స్టాండింగ్​ కమిటీ కూడా..

బుధవారం జరిగిన స్టాండింగ్​ కమిటీ సమావేశంలోనూ వివిధ అంశాల్లో వైఫల్యాలను ప్రస్తావిస్తూ 18 మందిలో 17 మంది ఓలిని దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఈ భేటీలో భారత్​పై వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.  

గుండెపోటు..

ఈ పరిణామాల మధ్య ఓలికి బుధవారం గుండె పోటు వచ్చింది. ఈ విషయాన్ని వెల్లడించగా వెంటనే వ్యక్తిగత భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఆయనను రాజధాని నగరం కాఠ్మాండూలోని షహీద్ గంగలాల్ నేషనల్ హార్ట్ సెంటర్‌కు తీసుకెళ్లారు.  

పార్టీ అధ్యక్షుడూ..

అన్ని విధాలుగా కేపీ ఓలి విఫలమయ్యారని మాజీ ప్రధాని, నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు ప్రచండ ఇదివరకే ఆరోపించారు. ప్రధాని పదవికి ఆయన రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అంతర్గత కలహాలు చెలరేగుతున్నా రాజీనామా చేసేందుకు ఓలి ససేమిరా అనడం వల్ల పార్టీని రెండుగా చీలుస్తానని ప్రచండ హెచ్చరించారు. పార్టీలో ఓలి అసమ్మతి నేతల మద్దతు ప్రచండకు లభించడం గమనార్హం.

అయితే పదవికి రాజీనామా చేయాలని పార్టీ సభ్యులు ఓలిపై ఒత్తిడి తీసుకురావడం ఇది మొదటిసారి కాదు. ఏప్రిల్​లోనూ ఇదే విధంగా ఓలిపై తమ అసహనాన్ని వ్యక్తం చేశారు నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (ఎన్​సీపీ) సభ్యులు.

భారత్​పై వివాదాస్పద వ్యాఖ్యలు..

కాఠ్మాండులోని ఓ హోటల్‌లో తనను పదవి నుంచి తొలగించేందుకు కుట్ర జరుగుతోందని కేపీ ఓలి ఇటీవల ఆరోపించారు. ఇందులో ఒక ఎంబసీ కీలకంగా వ్యవహరిస్తోందని భారత్​ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు నేపాల్‌లోని భారత దౌత్య కార్యాలయం కుట్ర పన్నుతోందని విమర్శించారు. ఇటీవల నేపాల్‌ జాతీయ పటం సవరణ బిల్లును ప్రవేశపెట్టినప్పటి నుంచి తనపై కుట్రలు జరుగుతున్నాయని వెల్లడించారు.

ఇదీ చూడండి:'నన్ను పదవి నుంచి దించేందుకు భారత్​ యత్నం'​

Last Updated : Jul 2, 2020, 1:14 PM IST

ABOUT THE AUTHOR

...view details