నేపాల్ రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. పార్లమెంటును రద్దు చేయాలని ప్రధాని కేపీ శర్మ ఓలీ చేసిన ప్రతిపాదనకు రాష్ట్రపతి విద్యా దేవీ భండారి ఆమోద ముద్ర వేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 30, మే 10న రెండు విడతలుగా మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. కేపీ శర్మ రాజకీయ ఎత్తుగడను ఊహించని ఆయన ప్రత్యర్థి వర్గం, ప్రతిపక్షం అయోమయానికి గురయ్యాయి. ప్రధాని నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నాయి.
గతకొద్ది నెలలుగా అధికార ఎన్సీపీ(నేపాల్ కమ్యూనిస్టు పార్టీ)లో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయి చేరాయి. పార్టీ అధ్యక్షుడు, ప్రధాని కేపీ శర్మ ఓలీతో.. పార్టీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ప్రచండ(పుష్ప కుమార్ దహాల్)కు మధ్య తలెత్తిన వివాదం తీవ్రమైంది. ఓలీ అవినీతిలో కూరుకుపోయారని, పరిపాలనలో విఫలమైనందున పదవి నుంచి తప్పుకోవాలని ప్రచండ డిమాండ్ చేశారు. వివాదం పరిష్కారం కోసం ఇరు వర్గాలు పలుమార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆదివారం అత్యవసరంగా మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్లమెంటు రద్దు చేయాలని తీర్మానించారు ఓలీ.
రాజ్యాంగ విరుద్దం..
ఓలీ నిర్ణయం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్దమని ఎన్సీపీ అధికార ప్రతినిధి నారాయణ్కాజీ శ్రేష్ఠ తెలిపారు. స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయంపై చర్చిస్తామని చెప్పారు. పార్టీ నాయకులంతా ప్రచండ నివాసంలో భేటీ కానున్నట్లు పేర్కొన్నారు.
ఓ పార్టీకి స్పష్టమైన మోజారీటీ ఉన్నప్పుడు ప్రధాని పార్లమెంటును రద్ధు చేయడం రాజ్యాంగానికి వ్యతిరేకమని నిపుణులు చెబుతున్నారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.
275 స్థానాలున్న నేపాల్ పార్లమెంటుకు 2017లో ఎన్నికలు జరిగాయి. ఇంకా రెండేళ్లు గడువు ఉంది. ఓలీ నిర్ణయంతో ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు అనివార్యమయ్యాయి.