తెలంగాణ

telangana

నేపాల్​ స్టాండింగ్ కమిటీ సమావేశం మళ్లీ వాయిదా

By

Published : Jul 8, 2020, 8:35 AM IST

Updated : Jul 8, 2020, 9:49 AM IST

నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ భవితవ్యంపై బుధవారం జరగాల్సిన కమ్యూనిస్ట్ పార్టీ(ఎన్​సీపీ) స్టాండింగ్ కమిటీ సమావేశం శుక్రవారం నాటికి వాయిదా పడింది. ప్రధాని పదవికి ఓలీ రాజీనామా చేయాలని పార్టీ సభ్యులే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. మరో వైపు నేపాల్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది.

Nepal pm future will have to decide today
నేపాల్​ స్టాండింగ్ కమిటీ సమావేశం మళ్లీ వాయిదా

నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(ఎన్​సీపీ) స్టాండింగ్ కమిటీ కీలక భేటీ మరోసారి వాయిదా పడింది. బుధవారం జరగాల్సిన సమావేశం శుక్రవారం జరగనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ సమావేశంతోనే ప్రధాని కేపీ శర్మ ఓలి రాజకీయ భవిష్యత్​ తేలనుంది. పార్టీ సభ్యులే ప్రధాని పదవికి ఓలీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టాండింగ్​ కమిటీ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

నేపాల్‌ నేతలతో చైనా మంతనాలు

నేపాల్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చైనా మరిన్ని ప్రయత్నాలు చేసింది. ప్రధాని కె.పి.శర్మ ఓలి రాజీనామా చేయాలంటూ పెరుగుతున్న డిమాండ్ల నేపథ్యంలో ఆయన్ని ఒడ్డుకు చేర్చేందుకు నేపాల్‌లో చైనా రాయబారి హో యాంకీ మంగళవారం కూడా అధికార నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (ఎన్‌సీపీ) నేతలతో ముమ్మరంగా మంతనాలు జరిపారు.

అధికారాన్ని పంచుకునే విషయంలో ఓలికి, సొంత పార్టీ అసమ్మతి నేత పుష్ప కమల్‌ దహాల్‌ ప్రచండకు మధ్య రాజీ కుదిర్చేందుకు పావులు కదిపారు. ప్రధాని నివాసంలో ఓలి, ప్రచండ మరోసారి భేటీ అయ్యారు. ప్రధాని, పార్టీ అధ్యక్ష పదవి.. రెండింటిలోనూ ఓలి ఒక్కరే కొనసాగడాన్ని అసమ్మతి నేతలు నిరసిస్తున్నారు. నేపాల్‌ వ్యవహారాల్లో చైనా జోక్యాన్ని నిరసిస్తూ కాఠ్‌మాండూలోని చైనా రాయబార కార్యాలయం ఎదుట నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు.

ఇదీ చూడండి:భూకంపాల నుంచి రక్షించే సుప్రీం రైలు

Last Updated : Jul 8, 2020, 9:49 AM IST

ABOUT THE AUTHOR

...view details