రాజ్యాంగ సవరణ బిల్లు కోసం నేపాల్ పార్లమెంటు శనివారం ప్రత్యేకంగా భేటీ అయింది. భారత సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాలను కలుపుతూ రూపొందించిన కొత్త మ్యాపును ఆమోదించేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టింది నేపాల్ ప్రభుత్వం. ఇప్పటికే ఈ బిల్లుపై చర్చించిన సభ్యులు శనివారం ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంది.
పార్టీల ఏకాభిప్రాయం..
జాతీయ పటం ఆమోదం కోసం నేపాల్ రాజ్యాంగంలోని షెడ్యూల్ 3కు సవరణ చేయాల్సి ఉంది. ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ సహా జనతా సమాజ్వాదీ పార్టీ ప్రకటించాయి. ఏకాభిప్రాభియం ద్వారా బిల్లును ఆమోదిస్తామని ఓ సీనియర్ మంత్రి చెప్పారు. కొత్త జాతీయ పటాన్ని అమల్లోకి తీసుకొచ్చే బిల్లు ప్రతిపాదనను జూన్ 9 న పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఆమోదం లాంఛనమే..
275 మంది ఉన్న దిగువ సభలో ఈ బిల్లు ఆమోదం పొందటానికి మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఇక్కడ ఆమోదం లభిస్తే జాతీయ అసెంబ్లీకి బిల్లు వెళుతుంది. అక్కడా అధికార పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్న నేపథ్యంలో బిల్లు పాసవ్వటం లాంఛనమే అని తెలుస్తోంది. అనంతరం ధ్రువీకరణ కోసం రాష్ట్రపతికి సమర్పిస్తారు. ఆయన ఆమోదముద్రతో రాజ్యాంగ సవరణ ప్రక్రియ పూర్తవుతుంది.