భారత్‌తో సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ మరో అడుగు ముందుకేసింది నేపాల్. భారత్‌లోని మూడు కీలక భూభాగాలను కలుపుకొని ఇటీవల విడుదల చేసిన నూతన మ్యాప్‌ను చేర్చి పాఠశాల కొత్త పాఠ్య పుస్తకాలను విడుదల చేసింది.
ఇటీవల విడుదల చేసిన కొత్త పుస్తకాల్లో నూతన మ్యాప్‌ను విద్యాశాఖ ఆధ్వర్యంలోని పాఠ్యాంశాల అభివృద్ధి కేంద్రం చేర్చినట్లు ఆ విభాగం సమాచార అధికారి గణేశ్ భట్టారాయ్ తెలిపారు.
9, 12వ తరగతుల కోసం 'నేపాల్ భూభాగం, సరిహద్దు సమస్యలకు పఠన సామగ్రి' అనే పేరుతో కొత్త పుస్తకాలను విడుదల చేసింది. అందులో విద్యా శాఖ మంత్రి గిరిరాజ్ మణి పోఖారెల్ ముందుమాట రాశారు.
నాణాలపై...
కాలపానీ ప్రాంతాన్ని కలుపుకొన్నట్లు సూచించే నాణాలు ముద్రించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దేశ కేంద్ర బ్యాంకుకు ఆదేశాలు జారీ చేసింది. రూ.1, 2 నాణాలపై కొత్త మ్యాప్‌ను ముద్రించేందుకు ప్రణాళికలు రచిస్తోంది బ్యాంకు.
మేలో విడుదల..
భారత్ కొత్త మ్యాప్ విడుదల చేసిన ఆరు నెలలకు.. భారత్‌లోని లిపులేఖ్, కాలపానీ సహా లింపియాధురా ప్రాంతాలను తమ పరిధిలో ఉన్నట్లు చూపించే కొత్త మ్యాప్‌ను 2020 మేలో విడుదల చేసింది నేపాల్. దానికి పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది.
కొత్త మ్యాప్‌ను నేపాల్ పార్లమెంట్ ఆమోదించటాన్ని తప్పుపట్టింది భారత్. నేపాల్ ప్రాదేశిక వాదనలకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని, కృత్రిమ విస్తరణగా పేర్కొంది.
ఇదీ చూడండి:కాలాపానీ మాదేనంటూ నేపాల్ కొత్త మ్యాప్