తెలంగాణ

telangana

ETV Bharat / international

కాలాపానీ మాదేనంటూ నేపాల్ కొత్త మ్యాప్ - lipulekh pass 80-Km new road inaugurated by Defence Minister Rajnath

భారత్​తో కయ్యానికి కాలుదువ్వుతోంది నేపాల్. సరిహద్దు భూభాగాల విషయమై ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగిన తరుణంలో ఆ దేశం మరో సాహసం చేసింది. కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలు సహా మొత్తం 350 కిలోమీటర్ల భూభాగాన్ని తమ పరిధిలోకి వచ్చేలా రూపొందించిన నూతన మ్యాప్​నకు నేపాల్ కేబినెట్​ ఆమోదం తెలిపింది.

Nepal approves new map
కాలాపానీ మ్యాప్

By

Published : May 19, 2020, 1:31 PM IST

భారత సరిహద్దులో ఉన్న లిపులేఖ్​, కాలాపానీ భూభాగాల విషయంపై ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో నేపాల్​ మరో అడుగు ముందుకేసింది. లిపులేఖ్, కాలపానీ సహా లింపియాధురా ప్రాంతాలను తమ పరిధిలో ఉన్నట్లు చూపించే కొత్త మ్యాప్​ను ఆ దేశ క్యాబినెట్ ఆమోదించింది.

నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యావలి తీసుకొచ్చిన ప్రతిపాదనకు సభ్యులు ఆమోదం తెలిపారు. నేపాల్​కు చెందిన ఈ ప్రాంతాలను తమకు అప్పగించాలన్న తీర్మానాన్నీ పార్లమెంట్​ ముందుకు తెచ్చారు. సరిహద్దు వివాదాలను భారత్​తో దౌత్యమార్గాల్లోనే పరిష్కరించుకుంటామని గ్యావలి చెప్పిన కొద్ది రోజులకే ఈ ప్రతిపాదన తీసుకురావడం గమనార్హం.

ఇదీ చదవండి:భారత్​, నేపాల్​ మధ్య కయ్యానికి చైనా కుట్ర!

అధికారిక విడుదల

నూతన పటానికి నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఒలి ఆమోదముద్ర వేసినట్లు ఆ దేశ ఆర్థికమంత్రి యువరాజ్ ఖాటివాడా తెలిపారు. ఈ మ్యాప్​ను భూభాగ నిర్వహణ మంత్రిత్వ శాఖ త్వరలోనే అధికారికంగా విడుదల చేయనున్నట్లు విదేశాంగ మంత్రి గ్యావలి పేర్కొన్నారు.

"లింపియాధురా, లిపులేఖ్, కాలాపానీ సహా నేపాల్​లోని మొత్తం ఏడు రాష్ట్రాలు, 77 జిల్లాలు, 753 స్థానిక డివిజన్లలో నూతన మ్యాప్​ను విడుదల చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది."

-ప్రదీప్ కుమార్ గ్యావలి, నేపాల్ విదేశాంగ మంత్రి

కొత్త మ్యాప్​లో..

లింపియాధురా సహా మొత్తం 335 కిలోమీటర్ల భూభాగం నేపాల్ పరిధిలోకి వచ్చేలా నూతన మ్యాప్​ను రూపొందించారు. 1816లో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం, నేపాల్​ మధ్య జరిగిన సుగౌలీ ఒప్పందం ఆధారంగా దీన్ని తయారు చేశారని... ఈ ఒప్పందం ప్రకారం కాలీ నది జన్మస్థలమైన లింపియాధురాను భారత్​-నేపాల్​ సరిహద్దుగా నిర్ణయించారని ఓ నేపాల్ అధికారి చెప్పుకొచ్చారు.

ఈ సమయంలోనా..?

అయితే నూతన మ్యాప్​ విషయంపై నేపాల్ కమ్యునిస్ట్ పార్టీ సీనియర్ నేత గణేష్ షా అసంతృప్తి వ్యక్తం చేశారు. నేపాల్ మొత్తం కరోనాతో పోరాడుతున్న ఈ సమయంలో ఇరుదేశాల మధ్య ఈ విషయం అనవసర ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. భారత్​తో చర్చలు ప్రారంభించి రాజకీయ, దౌత్య మార్గాల్లోనే సమస్య పరిష్కరించుకోవాలని హితవు పలికారు.

రోడ్డుమార్గంపైనా అభ్యంతరం

లిపులేఖ్​ పాస్​ను ఉత్తరాఖండ్​లోని ధార్చులాను కలుపుతూ భారత్​ నిర్మించిన రోడ్డు మార్గంపైనా నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోది. ఈ నిర్మాణంపై నిరసన వ్యక్తం చేస్తూ నేపాల్​లోని భారత రాయబారి వినయ్ మోహన్​కు గత వారం సమన్లు జారీ చేసింది. అయితే ఈ మార్గం పూర్తిగా తమ పరిధిలోకి వస్తుందని భారత్ పదేపదే స్పష్టం చేస్తోంది.

వివాదం

కాలపానీకి పశ్చిమాన ఉన్న లిపులేఖ్​ పాస్​ భూభాగంపై భారత్​-నేపాల్​ మధ్య వివాదం నడుస్తోంది. రెండు దేశాలు కూడా కాలాపానీని తమ దేశంలో అంతర్భాగంగానే పరిగణిస్తున్నాయి. ఉత్తరాఖండ్​లోని పిథోర్​గఢ్​ జిల్లాలో కాలపాని ఉందని భారత్​ చెబుతుండగా.. నేపాల్ మాత్రం తమ పరిధిలోని ధార్చులా జిల్లాలో ఈ ప్రాంతం ఉందని పేర్కొంటోంది.

ఇదీ చదవండి:చైనా అండతో నేపాల్ కయ్యం-భారత సైన్యంతో ఢీ!

ABOUT THE AUTHOR

...view details