పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్యంపై ఇప్పుడు ఆ దేశంలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. లండన్‌లో కుటుంబసభ్యులతో కలిసి ఓ కేఫ్‌లో టీ తాగుతున్న షరీఫ్ ఫొటో సామాజిక మధ్యమాల్లో వైరల్ అయింది. ఆ ఫొటో చూసిన వారంతా.. ఆయన అనారోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షరీఫ్ ఆరోగ్యంగానే ఉన్నారని, పాకిస్థాన్ తిరిగి వచ్చి అవినీతి ఆరోపణల కేసుల్లో విచారణ ఎదుర్కోవాలని అధికార పీటీఐ పార్టీ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు.
లీకైనా ఫొటోలో నవాజ్ తన మనమరాళ్లతో కలిసి ఓ రోడ్డు పక్కన ఉన్న కేఫ్‌లో టీ తాగుతున్నారు. ఈ ఫొటో చూస్తే.. ఆయన తీవ్ర అనారోగ్యంగా ఉన్నారనే వార్తలు అవాస్తవమని అర్థమవుతోందని, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలోనూ ఆయన కనీసం మాస్కు కూడా ధరించలేదని కొందరు పాకిస్థానీ మంత్రులు ఆరోపిస్తున్నారు. పాకిస్థాన్ న్యాయవ్యవస్థ తీరు ఎలా ఉందో ఈ ఫొటో చూస్తే తెలిసిపోతోందని సైన్స్ మంత్రి ఫవాద్ చౌద్రీ ధ్వజమెత్తారు.
కోర్టుకు అబద్ధాలు చెప్పి షరీఫ్ విదేశాలకు వెళ్లారని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సలహాదారు శబ్దాద్ గిల్ ఆరోపించారు. ప్రజలు తెలివితక్కువ వాళ్లని.. షరీఫ్ భావిస్తున్నట్టు, వెంటనే వచ్చి అవినీతి కేసులో విచారణ ఎదుర్కోవాలన్నారు.
మరోవైపు షరీఫ్ మద్దతుదారులు మాత్రం ఈ ఫొటో చూసి.. తమ నాయకుడు ఆరోగ్యంగా ఉన్నారని తెలిసి ఆనందపడుతున్నారు.