జైళ్లోనే మూడు వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్న రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ.. ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఆందోళన వ్యక్తం చేశారు. మరణం అంచుల్లో ఉన్న నవాల్నీ ఏ క్షణంలోనైనా ప్రాణాలు విడవచ్చని చెప్పారు. శరీరంలో పొటాషియం స్థాయిలు ఆందోళనకర స్థాయిలో పడిపోయాయని వెల్లడించారు. మూత్రపిండాల బలహీనతను సూచించే క్రియేటినిన్ స్థాయిలు వైద్య పరీక్షల్లో వెల్లడయ్యాయని చెప్పారు. ఈ విషయాన్ని ఫేస్బుక్ పేజీ ద్వారా పంచుకున్నారు.
అనారోగ్యంతో బాధపడుతోన్న తనకు వైద్యం అందించడానికి, వ్యక్తిగత వైద్యులకు జైళ్లోకి అనుమతి ఇవ్వకపోవడంపై నావల్నీ జైళ్లోనే నిరాహార దీక్ష చేపట్టారు. 2014లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలను నావల్నీ ఎదుర్కొంటున్నారు. గతేడాది ఆయనపై విష ప్రయోగం జరిగింది. ఈ ఏడాది జనవరి 17న జర్మనీ నుంచి స్వదేశానికి వచ్చిన నావల్నీని విమానాశ్రయంలో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరిలో కోర్టు ముందు హాజరుపరిచిన అనంతరం జైలుకు తరలించారు.