అగ్రదేశాలకు కొరకరాని కొయ్యగా మారిన ఉత్తరకొరియా తమ సైనిక సామర్థ్యాన్ని మరోసారి ప్రదర్శించింది. తాజాగా మరో రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను ప్రయోగించింది. ఈ పరీక్షలపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు కొరియా వార్తా సంస్థ కేసీఎన్ఏ తెలిపింది.
అవి ఎలాంటి ఆయుధాలు, ఎలా పనిచేస్తాయన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ ప్రయోగాలతో ఆయుధ వ్యవస్థల విశ్వసనీయతపై సైన్యానికి ఉన్న విశ్వాసం మరింత బలపడినట్లు కేసీఎన్ఏ తెలిపింది. జులై నుంచి ఇప్పటివరకూ 6 దశల్లో కొత్త ఆయుధాలను ప్యాంగ్‌యాంగ్ ప్రయోగించింది. దక్షిణ కొరియాలోని అమెరికా బేస్‌క్యాంపులే లక్ష్యంగా ఈ ఆయుధాలను ప్రదర్శించినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.