అమెరికాతో సైనిక విన్యాసాలు నిర్వహించనున్న దక్షిణ కొరియాకు మరోమారు గట్టి హెచ్చరికలు పంపారు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్. ఆక్రమణ ఉద్దేశంతో చేసే రిహార్సల్స్‌గా అభివర్ణించారు. తమ యుద్ధ సామర్థ్యాలను బలోపేతం చేసే చర్యలను వేగవంతం చేస్తున్నట్లు హెచ్చరించారు.
ఆగస్టు 16-26 మధ్య అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు చేపట్టనున్నాయి. అంతకు ముందు.. ఇరు దేశాల సైన్యాలకు నాలుగు రోజుల పాటు ప్రాథమిక శిక్షణ ఉంటుందని దక్షిణ కొరియా మీడియా వెల్లడించిన తర్వాత.. కిమ్ యో జోంగ్ మంగళవారం ఈమేరకు స్పందించారు. ఈ ప్రకటన విడుదల చేసేందుకు తనకు అధికారం అప్పగించారని, ఈ సందేశం నేరుగా తన సోదరుడి నుంచి వచ్చిందని స్పష్టం చేశారు కిమ్ యో.
"గతంలో చేసిన హెచ్చరికలను పక్కన పెట్టి ఉమ్మడి ప్రదర్శనలు చేయాలని దక్షిణ కొరియా తీసుకున్న నిర్ణయం.. నమ్మకద్రోహానికి నిదర్శనం. అది మిత్రపక్షాలను తీవ్రమైన భద్రతా ముప్పులోకి నెడుతుంది. ఈ సైనిక విన్యాసాలను కొనసాగించటం.. ఉత్తర కొరియా అణ్వాయుధాలపై చర్చల పునరుద్ధరణకు జో బైడెన్ పరిపాలన విభాగం పిలుపునివ్వటం వెనుక ఉన్న కపటత్వాన్ని తెలియచెబుతోంది. దక్షిణ కొరియా నుంచి అమెరికా తన బలగాలు, ఆయుధాలను ఉపసంహరించుకునే వరకు కొరియన్ ప్రాంతంలో శాంతి స్థాపన జరగదు. అమెరికా నుంచి ఎదురయ్యే సైనిక ముప్పును ఎదుర్కొనేందుకు కావాల్సిన సామర్థ్యాన్ని పెంచుకోవటంపై దృష్టి సారిస్తాం. మాపై ఏదైనా సైనిక చర్యకు పాల్పడితే.. దానిని వేగంగా తిప్పికొట్టేందుకు కావాల్సిన శక్తిమంతమైన ఆయుధాలను సమకూర్చుకోవటం సహా, జాతీయ రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం."