అగ్రరాజ్యం అమెరికా మాటలను ఉత్తర కొరియా లెక్కచేయడం లేదు. నిరాయుధీకరణ చర్చల్లో సుదీర్ఘ విరామం వచ్చిన నేపథ్యంలో మరోసారి క్షిపణి ప్రయోగానికి తెరతీసింది.
శనివారం రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను జపాన్ సముద్రం (తూర్పు సముద్రం) వైపు ఉత్తర కొరియా ప్రయోగించింది. ఉత్తర ప్యోంగన్ రాష్ట్రం నుంచి ఈ ప్రయోగం జరిగిందని 'సౌత్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్'ను ఉటంకిస్తూ యోన్హాప్ వార్తా సంస్థ తెలిపింది.
ఈ నెల ప్రారంభంలో కూడా ఉత్తర కొరియా రెండు సార్లు 'దీర్ఘ శ్రేణి క్షిపణు'లను పరీక్షించింది. అయితే ఇవి బాలిస్టిక్ క్షిపణులు అయ్యుండవచ్చని జపాన్ భావిస్తోంది.
చర్చలు విఫలమయ్యాయా?
ఉత్తర కొరియా ఆయుధీకరణ కార్యక్రమంపై ఐక్యరాజ్యసమితి, యూఎస్ అనేక ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ ఆ దేశం తన ఆయుధ సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటూనే ఉంది. ఈ పరిణామాల్ని పరిశీలిస్తే.. హనోయిలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన నిరాయుధీకరణ చర్చలు విఫలమయినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.