తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనా నుంచి 'కరోనా తుపాను'- కొరియా గజగజ! - చైనా ఎల్లో డస్ట్​ న్యూస్​

చైనా నుంచి వస్తోన్న 'ఎల్లో డస్ట్' వల్ల కరోనా వైరస్‌ తమ సామ్రాజ్యంలోకి వ్యాపిస్తుందనే భయంతో ఉత్తర కొరియా వణికిపోతోంది. దేశవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించింది. ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, కిటికీలను కూడా మూసి ఉంచాలని సూచించింది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది.

N-Korea-fears-from-Chinas-Yellow-dust
‘చైనా ఎల్లో డస్ట్‌’తో కిమ్ సామ్రాజ్యంలో వణుకు

By

Published : Oct 24, 2020, 7:35 PM IST

చైనా నుంచి వస్తోన్న 'ఎల్లో డస్ట్‌'తో ఉత్తర కొరియా వణికిపోతోంది. తాజాగా దేశవ్యాప్తంగా అలర్ట్‌ ప్రకటించింది. నిర్మాణ పనులపై నిషేధం విధించింది. ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, కిటికీలను కూడా మూసి ఉంచాలని అక్కడి అధికారిక మీడియా కొరియన్‌ సెంట్రల్‌ టెలివిజన్‌(కేసీటీవీ)ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే మాస్కులు ధరించాలని సూచించింది. చైనా నుంచి వస్తోన్న 'ఎల్లో డస్ట్' వల్ల కరోనా వైరస్‌ కిమ్‌ సామ్రాజ్యంలోకి వ్యాపిస్తుందనే భయంతోనే ఉత్తర కొరియా ఈ చర్యలు చేపట్టింది.

'ఎల్లో డస్ట్' ద్వారా ప్రాణాంతక వైరస్‌ దేశంలోకి ప్రవేశించడం వల్ల కలిగే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టాలని అక్కడి అధికారిక దినపత్రిక రొడొంగ్‌ సిన్‌మన్‌ విజ్ఞప్తిచేసింది. దీనిపై మరింత అప్రమత్తంగా ఉండాలని అంటువ్యాధుల నిరోధక కార్యకర్తలకు సూచించింది. ఇవి ప్రమాదకర విషవాయువులతోపాటు వైరస్‌లను కూడా వ్యాపింపజేస్తాయని రొడొంగ్‌ అభిప్రాయపడింది.

'కరోనా వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అమెరికా సీడీసీ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎల్లో డస్ట్‌ను కూడా తీవ్రంగా పరిగణించాలి. అందుచేత ఎల్లో డస్ట్‌ వల్ల కలిగే నష్టాలను నివారించడమే అత్యంత కీలకం' అని రొడొంగ్‌ సిన్‌మన్‌ వ్యాఖ్యానించింది. వీటితోపాటు ఉత్తర కొరియాలో ఉన్న వివిధ దేశాల విదేశాంగ కార్యాలయాలు కూడా వారి ప్రతినిధులను అప్రమత్తం చేశాయి.

ప్రమాదకరంగా 'ఎల్లో డస్ట్‌' తుపాన్లు..!

చైనా, మంగోలియా దేశాల్లోని ఎడారి ప్రాంతాల నుంచి వచ్చే దుమ్ము తుపానును 'ఆసియా డస్ట్‌', 'చైనా దుమ్ము తుపాను', 'ఎల్లో శాండ్'‌ వంటి పేర్లతో పిలుస్తారు. ప్రతి సంవత్సరం నిర్దిష్ట సమయంలో భారీ వేగంతో సంభవించే ఈ ఇసుక తుపాన్లు ఉత్తర, దక్షిణకొరియా ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా చైనా పారిశ్రామిక వ్యర్థాలతో ఈ ధూళి తుపానులు మరింత ప్రమాదకరంగా మారినట్లు ఇప్పటికే పలు నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. ఈ దుమ్ములో భారీస్థాయిలో ఉండే పీఎం2.5 ప్రమాదకర కణాలతో వీటి ముప్పు మరింత పెరుగుతున్నట్లు ఉత్తర, దక్షిణ కొరియా దేశాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా ఈ ప్రమాదకర ఇసుక తుపాన్ల కారణంగా తీవ్ర శ్వాసకోస సమస్యలు కూడా ఎదురౌతున్నట్లు గుర్తించాయి. తాజాగా కరోనా వైరస్‌కు కేంద్ర బిందువైన చైనా నుంచే ఈ దుమ్ము తుపానులు సంభవిస్తుండడం ఉత్తర కొరియా ఆందోళనకు కారణమైంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అమెరికా సీడీసీ కూడా గాలిలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలున్నట్లు ప్రకటించడం వల్ల ఉత్తర కొరియా మరింత భయంతో వణికిపోతోంది.

సున్నా కేసులు!

ఉత్తర కొరియాలో ఇప్పటివరకు అధికారికంగా ఒక్క కరోనా కేసు నమోదుకాలేదు. వైరస్‌ దేశంలోకి రాకుండా కట్టడి చేయడంలో భాగంగా అన్ని సరిహద్దుల్లో తీవ్ర ఆంక్షలు విధించింది. దీంతో ఇప్పటికే ఆర్థికంగా, రాజకీయంగా కుదేలవుతోన్న ఉత్తర కొరియాకు తాజా పరిస్థితులు మరింత వినాశకరంగా మారినట్లు అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కరోనా వైరస్‌ కారణంగా దేశం ఎదుర్కొంటున్న పరిస్థితిపై కిమ్‌ కన్నీటి పర్యంతమైనట్లు ఈ మధ్యే వార్తలు రావడం నిపుణుల వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details