అణుకార్యకలాపాల విషయంలో ఉత్తర కొరియా(North Korea) మళ్లీ దూకుడు వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. అణ్వాయుధాలకు తయారీలో కీలకమైన ఓ న్యూక్లియర్ రియాక్టర్ కేంద్రాన్ని తిరిగి ప్రారంభించినట్లు కనిపిస్తోందని ఐరాస అణు విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. అణుకార్యక్రమాల విషయంలో అమెరికాకు బహిరంగ బెదిరింపులకు దిగుతున్న క్రమంలో కిమ్ జోంగ్ ఉన్(Kim jong-un) ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టడం గమనార్హం.
యోంగ్బ్యోన్లోని 5 మెగా వాట్ల న్యూక్లియర్ రియాక్టర్‌ను ప్రారంభించినట్లు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ) తన వార్షిక నివేదికలో తెలిపింది. చాలా రోజుల నుంచి ఈ మేరకు సూచనలు కనిపించాయని పేర్కొంది. ఉపగ్రహ చిత్రాలు, విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా ఈ విషయం తమకు తెలిసిందని ఐఏఈఏ పేర్కొంది.
"ఫిబ్రవరి నుంచి జులై మధ్య యోంగ్బ్యోన్లోని రేడియోకెమికల్ లేబరేటరీని ఉత్తర కొరియా తిరిగి ప్రారంభిస్తోందనే సూచనలు కనిపించాయి. చాలా రోజుల నుంచి ఈ ప్రాంతంలో వాహనాలు సంచరించడం వంటివి కనిపించాయి. ఉత్తర కొరియా అణుకార్యకలపాలు తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి."
-ఐఏఈఏ
యోంగ్బ్యోన్లోని అణుకేంద్రంలో అణ్వాయుధాల తయారీలో ఉపయోగించే కీలకమైన ప్లుటోనియం ఉత్పత్తి జరగుతోందని సమాచారం. మరోవైపు.. అణ్వాయుధాల కార్యకలాపాల వ్యవహారంలో ఉత్తరకొరియా, అమెరికా మధ్య చర్చలు రెండున్నరేళ్లుగా స్తంభించాయి. అణ్వాయుధాల కార్యకలాపాల్లో అమెరికా విధించిన ఆంక్షలను సడలించకుంటే.. యుద్ధసామగ్రిని పెంచుకుంటామని ఇదివరకే హెచ్చరించారు ఉత్తకొరియా అధ్యక్షుడు కిమ్.