Suu kyi court sentence: మయన్మార్ బహిష్కృత నేత ఆంగ్‌సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది ఓ ప్రత్యేక కోర్టు. సూకీ.. కరోనా నిబంధనలను ఉల్లంఘించారని, సైన్యానికి వ్యతిరేకంగా ఇతరులను రెచ్చగొట్టారన్న నేరాల కింద దోషిగా తేల్చి, ఈ తీర్పును వెలువరించింది.
ఫిబ్రవరి 1న దేశంలో సైనిక తిరుగుబాటు జరిగినప్పటి నుంచి సూకీపై అనేక ఆరోపణలు మోపి.. దర్యాప్తు చేపట్టింది సైన్యం. అయితే శిక్షపడటం మాత్రం ఇదే తొలిసారి.
సూకీ, ఇతర నేతలను సైన్యం నిర్బంధించిన అనంతరం పార్టీ ఫేస్బుక్ పేజీలో కొన్ని వివాదాస్పద పోస్టులు దర్శనమిచ్చాయి. దానిపై విచారణ చేపట్టి, సూకీ తప్పుచేశారని తేల్చిచెప్పింది కోర్టు. మరోవైపు గతేడాది నవంబర్‌లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగడానికి కొన్ని రోజుల ముందు.. కరోనా నిబంధనలు ఉల్లంఘించారని సూకీకి ఈ జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై విమర్శలు రావడం వల్ల శిక్షను రెండేళ్లకు తగ్గిస్తున్నట్లు సైన్యం తెలిపింది.
ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించి వరుసగా రెండోసారి అధికారం చేపట్టింది సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీ. కానీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ.. సైన్యం తిరుగుబాటు చేసి నేతలను నిర్బంధించింది. అయితే ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనడానికి ఆధారాలేవీ తమకు దొరకలేదని పర్యవేక్షకులు చెప్పడం గమనార్హం.
Myanmar coup 2021: సూకీకి సంబంధించిన కోర్టు వ్యవహారాలను గతంలో ఆమె న్యాయవాది ప్రపంచానికి వెల్లడించేవారు. అయితే సూకీ గురించి ఏ విషయం కూడా బయటపెట్టకూడదని న్యాయవాది, మీడియాకు ఇటీవలే ఆదేశాలు అందాయి.