మయన్మార్‌లో తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసిన సైన్యం.. పాలనాపరమైన కార్యకలాపాలను చేపడుతోంది. రాజ్యాంగంలోని 419 సెక్షన్ ప్రకారం 11 మంది సభ్యులతో పరిపాలన మండలిని ఏర్పాటు చేసినట్లు భద్రతా దళాల కమాండర్ ఇన్ చీఫ్ కార్యాలయం వెల్లడించింది. అటార్నీ జనరల్, కేంద్ర ఆడిటర్ జనరల్, మయన్మార్ కేంద్ర బ్యాంకు గవర్నర్ పదవులకు సభ్యులను నియమించింది. పలు మంత్రిత్వ శాఖలను సైతం కేటాయించింది.
సోమవారం తిరుగుబాటు తర్వాత దేశంలో సైనిక ప్రభుత్వాన్ని నెలకొల్పినట్లు కమాండర్ ఇన్ చీఫ్, మయన్మార్ ప్రస్తుత అధినేత సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ లయాంగ్ పేర్కొన్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో అక్రమాలపై దర్యాప్తు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో అవకతవకలపై సూకీ ప్రభుత్వం విచారణ చేయకపోవడం కూడా తిరుగుబాటుకు ఓ కారణమని తెలిపారు. నూతనంగా ఏర్పాటయ్యే కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు.. ఓటింగ్ గణాంకాలను పరిశీలించి, సరైన ఫలితాలను గుర్తిస్తారని తెలిపారు. అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సూకీ ప్రభుత్వం తీసుకున్న కరోనా నివారణ చర్యలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
అవును.. సైనిక చర్యే
మయన్మార్‌పై ఆంక్షలు విధించే దిశగా అమెరికా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మయన్మార్‌లో సైనిక చర్య ద్వారానే ప్రభుత్వాన్ని పడగొట్టారని నిర్ధరించుకున్నట్లు తెలిపింది. ఈ అంశంపై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్.. ప్రభుత్వాధినేత ఆంగ్ సన్ సూకీ సహా ఇతర నేతలను సైన్యం నిర్బంధించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మయన్మార్‌లో అధికార బదలాయింపునకు కారణమైనవారిని బాధ్యులను చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.
అంతకుముందు మాట్లాడిన రక్షణ శాఖ సీనియర్ అధికారులు.. భారత్, జపాన్ వంటి దేశాలతో ప్రతిరోజు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. మయన్మార్ సైన్యంతో మెరుగైన సంబంధాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఆయా దేశాలతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు.