మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా జరగుతున్న ఆందోళనలను కట్టడి చేసేందుకు రాత్రి కర్ఫ్యూ విధించింది అక్కడి మిలిటరీ ప్రభుత్వం. ఐదుగురు కంటే ఎక్కువమంది బహిరంగంగా గుమిగూడవద్దని మయన్మార్‌లోని రెండు ప్రధాన నగరాలైన యాంగాన్, మాండలేలో కఠిన ఆంక్షలు విధించింది. కర్ఫ్యూ రాత్రి 8 నుంచి ఉదయం 4 వరకు ఉంటుందని తెలిపింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేంతవరకు ఆంక్షలు కొనసాగుతాయని సైనిక అధికారులు స్పష్టం చేశారు.
నిరసన సెగ..
సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా.. నిర్బంధంలో ఉన్న ఆంగ్ సాన్ సూకీని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ యాంగాన్ నగరంలో సోమవారం పెద్దఎత్తున ర్యాలీ చేపట్టారు ప్రజలు. పోలీసులు ఆందోళనకారులపై జలఫిరంగులు ప్రయోగించారు.