Myanmar massacre: ఈ ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్‌ను చెరబట్టి ప్రజలపై ఆకృత్యాలు సాగిస్తున్న సైనిక పాలకులు మరో దురాగతానికి పాల్పడ్డారు. తమ నుంచి ప్రాణభయంతో శరణార్ధి శిబిరాల్లో తలదాచుకుంటున్న30 మందిని మయన్మార్ సైన్యం దారుణంగా హతమార్చింది. మయన్మార్ కయాహ్ రాష్ట్రం మోసో గ్రామంలో ఈ దారుణం జరిగింది. వీరందరిని సైనికులు తుపాకీతో కాల్చి ప్రాణాలు తీశారు. అనంతరం మృతదేహాలకు తాళ్లు కట్టి మూడు వాహనాల్లో పడేసి నిప్పంటించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. అయితే మయన్మార్ సైనిక పాలకులు మాత్రం దీనిపై స్పందించేందుకు నిరాకరించారు.
మయన్మార్ సైన్యం దారుణాల నేపథ్యంలో మయన్మార్ ప్రజలు భారీ సంఖ్యలో పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌కు తరలిపోతున్నారు. పిల్లా పాలలతో కొండలు, వాగులు దాటుకుంటూ ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు.
ఈ ఘటనపై ఓ ప్రత్యక్ష చెప్పిన వివరాల ప్రకారం.. మోసో గ్రామ సమీపంలో మయన్మార్ సైనికులకు, అక్కడి సాంప్రదాయ గెరిల్లా సాయుధులకు మధ్య బీకర ఘర్షణ జరుగుతోంది. ఈ క్రమంలోనే గ్రామస్థులు శరణార్థ కేంద్రానికి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా సైనికులు వాళ్లని అరెస్టు చేశారు. అనంతరం వారందరినీ కాల్చి చంపారు. ఆ తర్వాత మృతదేహాలకు తాళ్లు కట్టి వాహనాల్లో పడేసి నిప్పంటించారు. సైన్యం మాత్రం ఇందుకు సంబంధించి స్పందించలేదు. అయితే సైనిక బలగాలకు, గెరిల్లా సాయుధులకు మధ్య ఘర్షణ జరగినట్లు ప్రభుత్వ మీడియా స్పష్టం చేసింది. గెరిల్లా సాయుధులు సైనికులపై పోరాడేందుకు శిక్షణ తీసుకునేందుకు వెళ్తుండగా.. వారి వాహనాలను బలగాలు అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర పోరు జరిగింది. ఈ క్రమంలో 7 వాహనాలను సైనిక బలగాలు దగ్ధం చేశాయి.
అయితే చనిపోయిన వారిలో మోసో గ్రామస్థులు కూడా ఉన్నారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. వారి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా దహనమయ్యాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:అంతరిక్ష చిక్కుముళ్లు విప్పేందుకు నింగిలోకి దూసుకెళ్లిన మహా విశ్వదర్శిని