మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం సృష్టిస్తున్న మారణహోమంలో ఇప్పటివరకు అధికారికంగా 500 మందికిపైగా పౌరులు చనిపోయినట్లు అధ్యయనాలు పేర్కొన్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.
ఫిబ్రవరి 1న మయన్మార్‌లో జరిగిన సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఊహించని విధంగా ప్రజావ్యతిరేకత వ్యక్తమవుతుండటం వల్ల.. ఈ ఆందోళనలను అణిచివేసేందుకు సైన్యం అత్యంత కర్కశంగా ప్రవర్తిస్తోంది. కనిపించినవారిని కనిపించినట్లే కాల్చేస్తోంది. ఇటీవల వైమానిక దాడులకూ తెగబడింది. దీంతో వేలాది మంది మయన్మార్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పక్కనే ఉన్న థాయ్‌లాండ్ తదితర దేశాలకు వలస పోతున్నారు.
వెనక్కి పంపుతున్న థాయ్!
అయితే వీరిలో కొందరిని థాయ్‌లాండ్ వెనక్కి పంపిస్తున్నట్లు తెలుస్తోంది. తమ దేశం సామూహిక వలసలను కోరుకోవడం లేదని.. కానీ, మానవహక్కులను పరిగణనలోకి తీసుకొని వీరిని అనుమతిస్తున్నట్లు థాయ్ ప్రధాని ప్రయూత్ చాన్ ఓచా పేర్కొన్నారు.
అయితే, మయన్మార్ నుంచి వచ్చినవారిని తిరిగి ఆ దేశానికి పంపేలా థాయ్ సైన్యం ఒత్తిడి పెంచుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, ఈ వార్తలను థాయ్ విదేశాంగ శాఖ ఖండించింది. అధికారిక సమాచారాన్ని నిర్ధరించకుండానే ఈ వార్తలను వ్యాప్తి చేస్తున్నారని పేర్కొంది. థాయ్‌లాండ్‌లోకి వచ్చిన ప్రజలను సంరక్షిస్తామని స్పష్టం చేసింది.
సరిహద్దు దాటి వచ్చిన ప్రజలతో మాట్లాడేందుకు విలేకరులు, స్థానికులు ప్రయత్నించగా.. థాయ్ సైన్యం అందుకు అంగీకరించలేదు.
భద్రతా మండలి సమావేశం
హింసాకాండ నేపథ్యంలో ఐరాస భద్రతా మండలి అంతర్గత సమావేశానికి బ్రిటన్ పిలుపునిచ్చింది. బుధవారం మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది. మయన్మార్ హింసను మండలి ఖండించినా.. సైన్యానికి వ్యతిరేకంగా ఆ దేశం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.