సరిహద్దులు, విభజనలు వంటి పాత సిద్ధాంతాలు ఇకపై ఎంతమాత్రం పనిచేయవని, భారత్, పాకిస్థాన్‌లలోని ప్రజలు శాంతియుతంగా జీవించాలని కోరుకుంటున్నారని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ చెప్పారు. రెండు దేశాలూ నిజమైన స్నేహితుల్లా మారితే చూడాలన్నదే తన కల అని ఉద్ఘాటించారు.
భారత్- పాక్‌ను అలా చూడాలన్నదే నా కల: మలాలా - మలాలా భారత్ పాక్
భారత్, పాకిస్థాన్‌లో ప్రజలు శాంతియుతంగా జీవించాలని కోరుకుంటున్నారని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ చెప్పారు. రెండు దేశాలూ నిజమైన స్నేహితుల్లా మారితే చూడాలన్నదే తన కల అని ఉద్ఘాటించారు.
భారత్ అయినా, పాకిస్థాన్ అయినా.. ప్రతి దేశంలోనూ మైనారిటీలకు రక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ఈ అంశం మతానికి సంబంధించినది మాత్రమే కాదని, అధికార దోపిడీకి సంబంధించినదని, దానిని తీవ్రంగా పరిగణించాలని వ్యాఖ్యానించారు. భారత్‌లో శాంతియుతంగా నిరసన చేస్తున్న ఉద్యమకారుల అరెస్టులు, ఇంటర్నెట్ నిలిపివేయడం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం ప్రజల ఆందోళనను పట్టించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
"మనం ఇరు దేశాలనూ సందర్శించాలి. పాకిస్థాన్ నాటక ప్రదర్శనలను మీరు చూడాలి. బాలీవుడ్ చిత్రాలను మేం చూడాలి. క్రికెట్ మ్యాచ్‌లను ఆస్వాదించాలి" అని అన్నారు. ఆదివారం వీడియో సమావేశం విధానంలో నిర్వహించిన జైపుర్ సాహితీ ఉత్సవం ముగింపు కార్యక్రమంలో మలాలా పాల్గొన్నారు. తన పుస్తకం 'ఐ యామ్ మలాలా: ద స్టోరి ఆఫ్ ద గర్ల్ హూ స్టుడ్ అప్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ వజ్ షాట్ బై ద తాలిబన్'పై ఈ సందర్భంగా ప్రసంగించారు. "నువ్వు భారతీయుడివి. నేను పాకిస్థానీ. మనిద్దరం బాగానే ఉన్నాం. అలాంటప్పుడు మనదిద్దరి మధ్య విద్వేషాలను సృష్టించుకోవడం ఎందుకు? సరిహద్దులు, విభాగాలు, విభజన, ఆక్రమణ వంటి పాత సిద్ధాంతాలు ఇకపై ఎంతమాత్రమూ పనిచేయవు. మనుషులుగా మనమంతా శాంతిని కోరుకుంటున్నాం" అని చెప్పారు.
- ఇదీ చూడండి:పొరుగు దేశాల చూపు నేపాల్ వైపు