పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్..తనకు ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు వెలువరించిన తీర్పును సవాలు చేస్తూ లాహోర్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముషారఫ్ తరపున ఆయన న్యాయవాది అజార్ సిద్దిక్ తమ 86 పేజీల పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వంతో సహా మరి కొంతమందిని నిందితులుగా పేర్కొన్నారు.
ఈ కేసు విచారణ త్వరితగతిన, హడావిడిగా ముగిసిందని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో క్రమరహితమైన, పరస్పర విరుద్ధమైన అంశాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. ప్రత్యేక కోర్టు తీర్పును వెంటనే నిలిపేయాలని ముషారఫ్ న్యాయస్థానాన్ని కోరారు.
తనకు వ్యతిరేకంగా ప్రత్యేక న్యాయస్థానం ముందు సమర్పించిన సాక్ష్యాల్లో రాజద్రోహానికి పాల్పడినట్లు లేదని ముషారఫ్ పిటిషన్‌లో పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలకు హాని కలిగించే చర్యలేవి తాను తీసుకోలేదని తెలిపారు. పిటిషన్ విచారణను.. జస్టిస్ మజాహిర్ అలీ అక్బర్ నఖ్వీ నేతృత్వంలోని ధర్మాసనం జనవరి 9న విచారణ చేపట్టనుంది.