Indonesia volcano eruption: ఇండోనేసియాలోని జావా ద్వీపంలోని సెమెరు అగ్నిపర్వతం బద్ధలు కావడం వల్ల హృదయవిదారక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 13కు చేరింది. మరో ఏడుగురు అదృశ్యమయ్యారు. ఈ మేరకు అధికారులు ఆదివారం తెలిపారు. దట్టమైన పొగ, బురద.. సహాయక చర్యలకు అవరోధంగా మారాయని చెప్పారు.
Mount semeru: తూర్పు జావా రాష్ట్రంలోని లుమాజాంగ్ జిల్లాలో ఉన్న మౌంట్ సెమెరు అగ్నిపర్వతం భారీ వర్షాల కారణంగా శనివారం ఆకస్మాత్తుగా విస్ఫోటనం చెందింది. దీంతో ఆకాశంలో 12,000 మీటర్ల ఎత్తున బూడిద ఎగజిమ్మింది. ఘటనా సమయంలో గ్యాస్, లావా పెద్దఎత్తున ఉబికి వచ్చాయి. పలుగ్రామాలపై బూడిద కమ్ముకుంది. ఎడతెరపి లేని వర్షం కారణంగా అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్ధలైందని జియోలాజికల్ సర్వే సెంటర్ అధిపతి ఈకో బుది లియోల్నో తెలిపారు. వర్షం, బూడిద కారణంగా భారీగా బురద పేరుకుపోయిందని వెల్లడించారు.
"అగ్నిపర్వతం బద్ధలు కావడం వల్ల లావా సమీపంలోని నదిలో 800 మీటర్ల దూరం ప్రవహంచింది. శనివారం రెండు సార్లు ఈ అగ్నిపర్వతం పేలింది. అగ్నిపర్వతం చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను 5కి.మీ.ల దూరంలో ఉండాలని సూచించాం."
-ఈకో బుది లియోల్నో, జియోలాజికల్ సర్వే సెంటర్