కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. ఇప్పటి వరకు 68 లక్షల 66 వేల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. మరణించిన వారి సంఖ్య 4 లక్షలకు చేరువైంది. మొత్తం 33 లక్షల 62 వేల మంది ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.
రష్యాలో ఇవాళ 8,855 కేసులు...
రష్యాలో గడిచిన 24 గంటల్లో 8,855 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 4,58,689కి ఎగబాకింది. మరో 197 మంది వైరకు బలయ్యారు. ఫలితంగా దేశ వ్యాప్తంగా 5,725 మంది మరణించారు. ఇప్పటి వరకు 2,21,388 మంది కోలుకున్నారు.
24 గంటల్లోనే 4,734 కేసులు
పాకిస్థాన్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో 4,734 మందికి వైరస్ సోకినట్లు ఆ దేశ ఆరోగ్య వర్గాలు తెలిపాయి. మరో 97 మంది మృతి చెందారు. ఫలితంగా దేశ వ్యాప్తంగా 1,935 మంది వైరస్‌కు బలయ్యారు. ఇప్పటి వరకు బాధితుల సంఖ్య 94 వేలకు చేరువైంది.
దక్షిణ కొరియాలో 51 కేసులు..
కరోనా మహమ్మారిపై విజయం సాధించిన దక్షిణ కొరియాలో మళ్లీ కేసులు నమోదవటం ఆందోళనను కలిగిస్తోంది. 24 గంటల్లో 51 కేసులు నమోదైనట్లు ఆ దేశ యంత్రాంగం ప్రకటించింది.