రష్యాలో(Russia covid cases) కరోనా మహమ్మారి (Corona virus in Russia) ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. భారీ సంఖ్యలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నందన కఠిన ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. రాజధాని మాస్కోలోని పాఠశాలలు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లతో పాటు.. దుకాణాలన్నింటినీ అక్టోబర్ 28 నుంచి 11 రోజుల పాటు మూసివేయాలని అక్కడి యంత్రాంగం నిర్ణయించింది. ఇప్పటికే దేశంలో నాలుగు రోజుల పాటు సెలవులను ప్రకటించారు.
అయితే రెస్టారెంట్లు, కేఫ్‌లు పార్శిల్ సర్వీసులను కొనసాగించవచ్చని.. మందుల దుకాణాలు సైతం తెరిచి ఉంటాయని మాస్కో నగర మేయర్ సోబియానిన్ ప్రకటించారు. మ్యూజియంలు, ఆర్ట్ థియేటర్లలోకి టీకాలు వేసుకున్న వారినే అనుమతించనున్నారు.
రష్యాలో తాజాగా 36,339 కొత్త కేసులు, 1,036 మరణాలు నమోదయ్యాయి. దీనితో ఐరోపాలోనే అత్యధికంగా రష్యాలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్యను 2,27,389కి చేరింది. కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల జాబితాలో తొలిస్థానాల్లో అమెరికా, బ్రెజిల్, భారత్, మెక్సికో ఉండగా.. రష్యా ఐదో స్థానంలో కొనసాగుతోంది.