అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్ చివురుటాకులా వణికిపోతోంది. ఐసిస్ ఉగ్రవాదుల ఆత్మాహుతి బాంబు దాడులతో(Kabul Airport blast) ఇక్కడి హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసరాలు కకావికలమయ్యాయి. మృతుల సంఖ్య 182కి చేరినట్లు తెలుస్తోంది. మరోవైపు ముష్కరులు మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా తాజాగా హెచ్చరించింది. కాబుల్‌లో గురువారం సాయంత్రం జంట పేలుళ్ల తర్వాత పరిస్థితి భీతావహంగా మారడంతో పాటు.. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు మిన్నంటాయి. కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా లేకపోయినా, ప్రాణాలు దక్కించుకోవడం ఎలాగన్న ఆత్రుత.. తదుపరి విమానం ఎక్కయినా దేశాన్ని విడిచే అవకాశం రాకపోతుందా అన్న ఉత్కంఠ.. విమానాశ్రయ పరిసరాల్లో నెలకొన్నాయి.
'ఐఎస్‌ఐఎస్-కే' పనే..
జంట పేలుళ్లలో మృతిచెందిన వారిలో 28 మంది తాలిబన్లు(Afghan Taliban) సహా మొత్తం 169 మంది అఫ్గాన్లు ఉన్నారని, ఈ సంఖ్య మరింత పెరగవచ్చని స్థానిక అధికారులు శుక్రవారం వెల్లడించారు. చనిపోయినవారిలో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. పేలుళ్ల ధాటికి గాయపడిన వారి సంఖ్య 150కి చేరింది. ఈ ఆత్మాహుతి దాడులకు(Suicide attack) పాల్పడింది తామేనని ఐఎస్‌కేపీ (ఐఎస్‌ఐస్-కే) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఇక దేశంపై పూర్తి ఆధిపత్యం తమదేనని.. ఇతరులకు హాని తలపెట్టే ఉగ్రవాదులకు తమ భూభాగంలో చోటే ఉండదని.. విదేశీ పౌరుల తరలింపు పూర్తయ్యేవరకూ ఎలాంటి దాడి జరగబోదంటూ ప్రపంచ దేశాలకు ధీమాగా చెబుతూ వచ్చిన తాలిబన్.. ఐస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను నిలువరించలేకపోతోంది! మరోవంక కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయమే లక్ష్యంగా ముష్కరులు మరిన్ని దాడులకు పాల్పడవచ్చని అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్ ఫ్రాంక్ మెకన్జీ ప్రకటించారు.
పేలుళ్లకు ముందు కాల్పులు...
కాబుల్ విమానాశ్రయంలో పేలుళ్లు సంభవించడానికి ముందు విమానాశ్రయం వద్ద జనం పరుగులు తీస్తున్న వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం విమానాశ్రయం అమెరికా బలగాల ఆధ్వర్యంలోనే ఉంది. అయితే, ఎయిర్‌పోర్టు వెలుపల, అక్కడ పోటెత్తుతున్న జనాన్ని సాయుధ తాలిబన్లు నియంత్రిస్తున్నారు. పరిస్థితి అదుపు తప్పినప్పుడల్లా వారు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. గురువారం వారు కాల్పులు జరపడంతోనే జనం భయంతో పరుగులు తీస్తున్నట్టు ఆ దృశ్యాలను బట్టి తెలుస్తోంది. ఇది జరిగిన తర్వాత ఇద్దరు ముష్కరులు బాంబులతో వచ్చి ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. వారితో పాటు వచ్చిన మరో వ్యక్తు తుపాకీతో కాల్పులు జరిపాడు.
తప్పించుకున్న సిక్కులు, హిందువులు!
జంట పేలుళ్లను అఫ్గాన్‌లోని సిక్కులు, హిందువులు త్రుటిలో తప్పించుకున్నారు. ఇవి జరగడానికి కొన్ని గంటల ముందే 145 మంది సిక్కులు, 15 మంది హిందువులు ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్నట్టు పలువురు సిక్కులు తెలిపారు. విమానాశ్రయం లోనికి వెళ్లేందుకని పేలుడు సంభవించిన ప్రాంతంలోనే కొన్ని గంటలపాటు వేచి చూసినట్లు పేర్కొన్నారు.
పాక్ నుంచి తాలిబన్లు బుకాయింపులు నేర్చుకున్నారు: అమ్రుల్లా సలేహ్