తెలంగాణ

telangana

ETV Bharat / international

గువాహటిలో ఆగ్రహ జ్వాల... మోదీ-అబే భేటీ వాయిదా

అసోం గువాహటి వేదికగా ఈనెల 15 నుంచి 17 వరకు భారత్​-జపాన్ మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక వార్షిక సమావేశం వాయిదా పడింది. పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి ఇరుదేశాలు. వచ్చే ఏడాది సమావేశం జరగొచ్చని విదేశాంగ శాఖ ప్రకటించింది.

Modi-Abe summit cancelled in view of widespread protests in Guwahati over citizenship law
గువాహటిలో ఆగ్రహ జ్వాల... మోదీ-అబే భేటీ వాయిదా

By

Published : Dec 13, 2019, 4:43 PM IST

పౌరసత్వ చట్ట సవరణతో ఈశాన్య రాష్ట్రాల్లో చెలరేగుతున్న నిరసన సెగలు భారత్-జపాన్​ వార్షిక సదస్సుపై ప్రభావం చూపాయి. ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్​ ప్రధాని షింజో అబే మధ్య గువాహటి వేదికగా జరగాల్సిన సమావేశం వాయిదా పడింది.

ఈ నెల 15 నుంచి 17వ తేదీ మధ్య ఇరువురు నేతలు భేటీ కావాల్సి ఉంది. అయితే ఇరుదేశాలకు అనుకూలమైన మరో రోజున సమావేశం నిర్వహించేందుకు భారత్​-జపాన్​ అంగీకరించాయి. ఈ మేరకు విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్​ కుమార్​ ప్రకటన విడుదల చేశారు. వచ్చే ఏడాది ద్వైపాక్షిక భేటీ జరగొచ్చని తెలిపారు.

"జపాన్ ప్రధాని షింజో అబే భారత్​ పర్యటన వాయిదా పడింది. భవిష్యత్​లో పరస్పర అనుకూలమైన రోజున ప్రధాని మోదీతో అబే సమావేశమవుతారు."
- రవీశ్​ కుమార్​, విదేశాంగశాఖ అధికార ప్రతినిధి

భారత్​-జపాన్​ ద్వైపాక్షిక సమావేశం డిసెంబరు 15 నుంచి 17 వరకు జరగనున్నట్లు విదేశాంగశాఖ గతవారమే ప్రకటించింది. అయితే ఎక్కడ జరగబోయేది మాత్రం స్పష్టం చేయలేదు. అయినప్పటికీ గువాహటిలో ప్రధాని మోదీ-షింజో అబేల భేటీకి చురుగ్గా పనులు జరుగుతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ, వివాదాస్పద పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం తెలిపినప్పటి నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు మిన్నంటాయి.

ఈ నేపథ్యంలో గువాహటిలో తాజా పరిస్థితులతో పాటు సదస్సు పనులను సమీక్షించేందుకు జపాన్​ బృందం బుధవారమే అక్కడికి చేరుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో షింజో అబే భారత్​లో పర్యటించడం కుదరని విదేశాంగ శాఖకు వివరించింది. ఫలితంగా జపాన్​ ప్రధాని భారత పర్యటన వాయిదా పడింది.

ABOUT THE AUTHOR

...view details