తెలంగాణ

telangana

ETV Bharat / international

జపాన్‌లో ఫోన్​ అలా మాట్లాడితే వింతగా చూస్తారట! - జపాన్లో మొబైల్​ వినియోగ నిబంధనలు

శాస్త్ర సాంకేతిక రంగం రాజ్యమేలుతున్న నేటికాలంలో.. ఫోన్​ చేతిలో లేకపోతే క్షణం కూడా గడవదు. అరచేతిలో ఫోన్​ పట్టుకుని ప్రపంచాన్ని శాసిస్తున్నారు. కానీ.. మనుషుల మధ్య దూరం పెరిగిపోతోంది. కనీసం తమచుట్టూ ఏం జరుగుతుందో కూడా పసిగట్టలేకపోతున్నారు. అయితే.. ఈ విషయంలో జపాన్​ భిన్నంగా వ్యవహరిస్తోంది. మొబైల్​ వాడకంపై ప్రత్యేక నిబంధనలు పాటిస్త్తూ ఇతర దేశాలకు చక్కటి సందేశాన్నిస్తూన్నారు జపనీయులు. ఆ నిబంధనలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం..

Mobile phone users follow unique rules in Japan
జపాన్‌లో 'అలా' మాట్లాడితే వింతగా చూస్తారట!

By

Published : Oct 16, 2020, 5:47 AM IST

నేటి ఆధునిక కాలంలో చాలామందికి మొబైల్‌ ఫోన్‌ చేతిలో లేకపోతే క్షణం గడవదు. సమయం చూసుకోవడం మొదలు.. సమస్యల పరిష్కారం వరకు అన్నింటికి ఫోన్‌పైనే ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో మనుషుల మధ్య మాటలు తగ్గిపోతున్నాయి. ఒంటరిగా ఉన్నా, జనాల మధ్య ఉన్నా చేతిలో మొబైల్​ పట్టుకొని ప్రపంచాన్ని చూసే యూజర్లు.. తమ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు. చరవాణితో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని అనర్థాలున్నాయి. అందుకే దాన్ని పరిమితంగా.. ఇతరులకు ఇబ్బంది కలగకుండా.. మనం ఇబ్బందుల్లో పడకుండా వాడాలి. ఈ విషయంలో జపాన్‌ ప్రజలు ఇతర దేశాల కంటే ముందున్నారు. అక్కడి వారంతా మొబైల్‌ వాడకంలో కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు. వాటిని తూచ తప్పకుండా పాటిస్తున్నారు. అవేంటంటే..

ప్రజా రవాణాలో ఫోన్‌ మాట్లాడటం నిషేధం

ప్రజా రవాణాలో ఫోన్‌ మాట్లాడటం నిషేధం

చాలామంది తమకు ఫోన్‌ కాల్‌ వచ్చిన వెంటనే ఎక్కడున్నామన్న సంగతి కూడా మర్చిపోయి తెగ మాట్లాడేస్తుంటారు. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణిస్తున్నా పక్కవారికి ఇబ్బంది కలుగుతుందన్న విషయాన్ని కూడా గుర్తించరు. కానీ.. జపాన్‌లో అలా చేయరు. బస్సు, రైళ్లు ఎక్కగానే మొబైల్‌లో సౌండ్‌ పూర్తిగా తగ్గిస్తారు. ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఫోన్‌ వాడతారు. ఎవరైనా ఫోన్‌లో మాట్లాడటం కనిపిస్తే వారిని వింతగా చూస్తారట.

వైర్‌లెస్‌ డివైజ్‌లకు నో

వైర్‌లెస్‌ డివైజ్‌లకు నో

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. కొత్త వస్తువులు ఆవిష్కృతమవుతున్నాయి. ఈ విధంగానే స్మార్ట్‌ మొబైల్స్‌ యూజర్ల కోసం వైర్‌లెస్‌ డివైజ్‌లు అందుబాటులోకి వచ్చాయి. మొబైల్‌ను చేతితో తాకకుండా బ్లూటూత్‌, వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్స్‌తో ఫోన్‌లో మాట్లాడటం, పాటలు వినడం ఇప్పుడు సర్వసాధారణమైన విషయం. కానీ.. ఇప్పటికీ జపనీయులు ఇలాంటి వైర్‌లెస్‌ డివైజ్‌లు వాడటానికి ఇష్టపడట్లేదు. కాల్స్‌ వస్తే.. మొబైల్‌ను చేతిలో పట్టుకొని మాట్లాడటం లేదా ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకొని మాట్లాడతారు. వెర్‌లైస్‌ డివైజ్‌ల సాయంతో ఫోన్‌ మాట్లాడితే.. తమకు తాము మాట్లాడుకునే పిచ్చివాళ్లలా భావిస్తారట అక్కడివాళ్లు. అందుకే వాటిని ఉపయోగించేవారు అరుదు.

వినాలంటే హెడ్‌ఫోన్స్‌ తప్పనిసరి

వినాలంటే హెడ్‌ఫోన్స్‌ తప్పనిసరి

ప్రపంచవ్యాప్తంగా చాలామంది.. ఇంట్లో లేదా ప్రయాణిస్తున్నప్పుడు హెడ్‌ఫోన్స్‌ పెట్టుకోకుండా మొబైల్‌లో పాటలు, వీడియోలు ప్లే చేస్తుంటారు. దానివల్ల తోటివారికి ఇబ్బంది కలుగుతుందని కూడా ఆలోచించరు. అయితే.. జపాన్‌లో మాత్రం.. ఎట్టి పరిస్థితుల్లోనూ హెడ్‌ఫోన్స్‌ పెట్టుకునే పాటలు వినడం, వీడియోలు చూడటం చేస్తారట. పొరపాటున మొబైల్‌ ఫోన్‌కు హెడ్‌ఫోన్స్‌ సరిగా కనెక్ట్‌ కాకుండా శబ్దాలు బయటికి వస్తే.. అపరాధం చేసిన వారిలా బాధపడతారు. పక్కన ఉండే వారికి ఇబ్బంది కలిగినందుకు క్షమాపణ కూడా చెబుతారు.

ఆఫీసుల్లో మొబైల్‌ వాడితే ఒట్టు

ఆఫీసుల్లో మొబైల్‌ వాడితే ఒట్టు

జపాన్‌ ప్రజలు కష్టజీవులన్న విషయం అందరికి తెలిసిందే. పనిచేసే సమయంలో ఇతర పనుల కోసం క్షణకాలం వృథా చేయరు. సమయపాలనను కచ్చితంగా పాటిస్తారు. ఇక ఆఫీసుల్లో అడుగుపెట్టిన తర్వాత ఉద్యోగులు కనీసం తమ మొబైల్‌ను కూడా చూసుకోరు. ఏదైనా అత్యవసర ఫోన్‌ కాల్స్‌ మాట్లాడాల్సి వస్తే బాస్‌ అనుమతి తీసుకొవాల్సి ఉంటుంది. అయితే కొన్ని సంస్థలు తమ ఉద్యోగులు ఎలక్ట్రిక్‌ వస్తువుల ఉపయోగించుకోవడం కోసం ప్రత్యేక సమయం కేటాయిస్తున్నాయి.

వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం

వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం

నేటి కాలంలో సోషల్‌మీడియా వినియోగం బాగా పెరిగింది. యూజర్లు చక్కగా తయారై ఫొటోలు దిగి.. తమ ప్రొఫైల్‌ పిక్​గా పెట్టుకుంటున్నారు. వ్యక్తిగత విషయాలను ఆన్‌లైన్‌లో పంచుకుంటున్నారు. ఈ విషయంలో జపాన్‌ వాసులు కాస్త జాగ్రత్త పడతారు. అక్కడ చాలా మంది తమ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకునేందుకు విముఖత చూపిస్తారు. అందుకే సోషల్‌మీడియా ఖాతాల్లో వారి ఫొటోలకు బదులు పిల్లల ఫొటోలు, యానిమేషన్‌ క్యారెక్టర్ల ఫొటోలు కనిపిస్తుంటాయి.

ఇక్కడ మాత్రం పూర్తిగా భిన్నం

ఇక్కడ మాత్రం పూర్తిగా భిన్నం

మొబైల్‌ ఫోన్‌ వాడకంలో ఇంత చక్కటి నిబంధనలు పాటిస్తూ.. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే జపనీయులు రోడ్డుపై నడుస్తున్నప్పుడు భిన్నంగా ప్రవర్తిస్తారు. నడిచి వెళ్తున్నప్పుడు మొబైల్‌ఫోన్‌లో మునిగిపోతారు. నడుస్తూనే మొబైల్‌లో ఛాటింగ్, బ్రౌజింగ్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చేవాళ్లను కూడా గమనించరు. ఇలాచేస్తూ ఒకరినొకరు ఢీకొని ప్రమాదాలు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. వీటిని నివారించడం కోసం ఏకంగా కొన్ని యాప్స్‌ మార్కెట్లోకి రావడం గమనార్హం. ఈ యాప్స్‌ మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే ఎదురుగా ఎవరైనా వస్తే వెంటనే తెలిసిపోతుంది. తద్వారా వారిని ఢీకొట్టకుండా పక్కకు తప్పుకొనే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి:'భారత్​లో 9కోట్ల మందికి ఆ సౌకర్యాలు లేవు'

ABOUT THE AUTHOR

...view details