పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలోని ఓ హిందూ ఆలయంపై అల్లరి మూక దాడి చేసింది. ఆలయానికి నిప్పు పెట్టి విగ్రహాలను ధ్వంసం చేశారు. స్థానిక పోలీసులతో పరిస్థితులు అదుపులోకి రాకపోవటం వల్ల పాకిస్థాన్ రేంజర్స్‌ను రంగంలోకి దింపారు అధికారులు.
రహీమ్ యార్ ఖాన్ జిల్లాలోని భోంగ్ నగరంలో ఉన్న హిందూ ఆలయంపై బుధవారం దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం తలెత్తిన వివాదం తీవ్రమై... ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.
ఎంపీ ట్వీట్..
అధికార పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ ఎంపీ డాక్టర్ రమేశ్ కుమార్ వంక్వానీ.. ఆలయంపై దాడి వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. భద్రతా అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆలయంపై దాడిని అడ్డుకోవాలని కోరారు. హిందూ ఆలయంపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పరిస్థితులు తీవ్రంగా ఉన్నట్లు రాసుకొచ్చారు.
హిందూ కుటుంబాలకు భద్రత..
అల్లరి మూకలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు తెలిపారు జిల్లా పోలీస్ అధికారి రహీమ్ యార్ ఖాన్ అసద్ సర్ఫరాజ్. రేంజర్స్‌ను రప్పించి.. ఆలయం చూట్టూ మోహరించినట్లు చెప్పారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న 100 హిందూ కుటుంబాలకు సైతం భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే.. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు. శాంతిభద్రతలను పునరుద్ధరించటం, మైనారిటీలకు భద్రత కల్పించటమే తమ తొలి ప్రాధాన్యమని చెప్పారు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.
పాక్ రాయబారికి సమన్లు
మందిరం కూల్చివేతపై నిరసన వ్యక్తం చేస్తూ.. పాకిస్థాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది భారత విదేశాంగ శాఖ. పాక్‌లోని మైనారిటీల మత స్వేచ్ఛపై జరుగుతున్న వరుస దాడులు ఆందోళనకరమని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి పేర్కొన్నారు. తాజా ఘటనను ఖండిస్తూ పాక్‌కు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి:పాక్‌లో మరో పురాతన ఆలయంపై దాడి!