కేసులు పెరుగుతున్నప్పటికీ.. దేశవ్యాప్తంగా లాక్డౌన్ను సడలించడాన్ని సమర్థించుకున్నారు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. లాక్‌డౌన్ సడలించకపోతే.. దేశంలో ఆకలి చావులు పుట్టుకొచ్చేవన్నారు. పాకిస్థాన్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు.. "ప్రజలను కరోనా నుంచి కాపాడాలా.. లేదా వారి ఆకలి తీర్చి ప్రాణాలు కాపాడాలా?" అనే ప్రశ్నలతో సందిగ్ధంలో పడ్డాయన్నారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక స్థితిని వివరిస్తూ.. ప్రపంచ ఆర్థిక వేదికనుద్దేశించి మాట్లాడిన ఓ వీడియోలో ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"మేము రెండు సవాళ్లను ఎదుర్కోవాలి. ఒకటి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడమైతే.. మరొకటి లాక్‌డౌన్ వల్ల పెరుగుతున్న పేదరికం ప్రభావాన్ని తగ్గించడం. మా దేశంలో లక్షలాది మంది రోజువారి కూలీపని చేసుకోలేక, అలా అని సొంత వ్యాపారాలు చేసుకోలేని వారు దాదాపు 2.5కోట్ల మంది. లాక్‌డౌన్ కారణంగా వారి కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. అంటే దాదాపు 15 కోట్ల మంది ఇబ్బంది పడుతున్నారు."