అఫ్గానిస్థాన్‌పై పట్టు సాధించుకునేందుకు.. తాలిబన్లకు(Afghanistan Taliban) ఎంతో సమయం పట్టలేదు. వేగంగా పలు కీలక ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అమెరికా లాంటి అగ్రరాజ్యం అండ ఉన్నప్పటికీ అఫ్గాన్‌ను ఓ తిరుగుబాటు దళం తేలిగ్గా ఆక్రమించుకోగలిగింది.
అమెరికా, నాటో మిత్ర దేశాలు.. 20 సంవత్సరాలకుపైగా అఫ్గాన్ బలగాలకు(Afghanistan forces) శిక్షణ ఇవ్వడమే కాక.. ఆయుధ సంపత్తినీ సమకూర్చాయి. అఫ్గాన్‌లో భద్రతకు పూచీకత్తు వహించేలా అక్కడి పౌర ప్రభుత్వానికి తోడ్పాటు అందించడానికి అమెరికా.. ఈ ఏడాది జూన్ 30 నాటికి దాదాపు 89 బిలియన్ డాలర్లను వెచ్చించింది. అయితే.. ఇదంతా ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరు అయింది. కంటైనర్ల కొద్దీ ఆయుధాలు(Taliban weapons), యుద్ధవాహనాలు, విమానాలు, సైనిక మౌలిక వసతులు తాలిబన్ల వశమయ్యాయి. హమ్వీస్, నైట్ సైట్స్, మెషీన్ గన్స్, మోర్టార్స్ వంటివి అందులో ఉన్నాయి.
ఇప్పుడు అఫ్గాన్ వైమానిక దళం సహా లక్షల అధునాతన ఆయుధాలు, బుల్లెట్లు, యుద్ధ విమానాలు, మిలటరీ డ్రోన్లు తాలిబన్ల వశమయ్యాయి.
వెనక్కి వెళ్లే హడావుడిలో..
తాలిబన్లతో ఒప్పందం ప్రకారం.. అమెరికా మెల్లమెల్లగా అఫ్గాన్ నుంచి వైదొలుగుతోంది. ఆగస్టు 31 వరకు పూర్తిగా ఆ దేశాన్ని ఖాళీ చేయాలి. ఈ హడావుడిలో ఎన్నో ప్రాంతాల్లో తమ ఆయుధాలు, యుద్ధ సామగ్రి మొత్తం అక్కడే వదిలేసి వెళ్లాయి అగ్రరాజ్య బలగాలు. ఈ క్రమంలోనే దేశంపై ఒక్కసారిగా తాలిబన్లు(Taliban news) విరుచుకుపడటం.. అధ్యక్షుడు సహా వేలాది సైనికులు పారిపోవడం జరిగాయి. ఇప్పుడు ఆ ఆయుధ డంపులు తాలిబన్ల చెంత చేరాయి.
ఏమేం ఉన్నాయి..
అఫ్గాన్ వాయుసేనతోపాటే అమెరికా అందించిన అత్యాధునిక ఆయుధాలు తాలిబన్ల చేతికి వచ్చాయి. వాటిల్లో ఏమేం ఉన్నాయంటే..
- అమెరికాకు చెందిన యూఎస్ హమ్వీలతో సహా 2 వేలకుపైగా సాయుధ వాహనాలు
- 40కిపైగా యుద్ధవిమానాలు (అమెరికాకు చెందిన యూహెచ్-60 బ్లాక్ హాక్స్లతో కలిపి)
- స్కౌట్ అటాక్ హెలికాఫ్టర్లు
- స్కాన్ఈగల్ మిలటరీ డ్రోన్లు
- 6 లక్షలకుపైగా తేలికపాటి ఆయుధాలు. ఇందులో ఎం-16, ఎం-4 వంటి అత్యాధునిక రైఫిళ్లు(తుపాకులు) ఉన్నాయి.
- 76 వేలకుపైగా ట్రక్కులు.
- 16 వేల నైట్ విజన్ గాగుల్స్
- లక్షా 62 వేల రేడియోలు
- మందుగుండు సామగ్రి, గ్రనేడ్లు, రాకెట్ లాంఛర్లు