సింగపూర్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఆన్‌లైన్ వేదికగా ఉద్యమం నడుస్తోంది. మానసికంగా దివ్యాంగుడైన వ్యక్తికి ఉరిశిక్ష విధించొద్దంటూ విన్నవిస్తున్నారు మానవ హక్కుల కార్యకర్తలు. 2010లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో దోషిగా తేలిన మలేసియాకు చెందిన భారత సంతతి వ్యక్తి నాగేంద్రన్ కె ధర్మలింగం కోసమే ఇదంతా చేస్తున్నారు.
'దారులు మూసుకుపోయ్..'
అయితే ధర్మలింగం ఆరోగ్య పరిస్థితి సరిగానే ఉందని.. చేసిన అప్పులు తీర్చేందుకు పూర్తి అవగాహనతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నాడని హైకోర్టుతో పాటు అప్పీల్ కోర్టు సమర్థించినట్లు సింగపూర్ హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. అతనితో బలవంతంగా ఈ పని చేయించారనే వాదనలను తోసిపుచ్చింది. ఈ మేరకు 'టుడే వార్తాపత్రిక' ఓ కథనాన్ని ప్రచురించింది. నాగేంద్రన్ కుటుంబం మలేసియా నుంచి సింగపూర్‌కు వచ్చేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపిన హోమంత్రిత్వ శాఖ.. క్షమాభిక్ష కోసం అధ్యక్షునికి పెట్టుకున్న అర్జీ తిరస్కరణకు గురైందని స్పష్టం చేసింది.
మహోద్యమం..
నవంబరు 10న నాగేంద్రన్‌ను ఉరి తీయనున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలతో ఆందోళన చెందిన మానవ హక్కుల కార్యకర్తలు క్షమాభిక్ష కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. హైపర్ యాక్టివిటీ డిజార్డర్‌తో బాధపడుతున్న నాగేంద్రన్‌కు.. క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ సింగపూర్ అధ్యక్షుడు హలీమా యాకోబ్‌కు అభ్యర్థనలు పంపుతున్నారు. అక్టోబర్ 29న ఆన్‌లైన్ వేదికగా ఓ కార్యక్రమాన్ని ప్రారంభించి.. 50వేల సంతకాల సేకరణను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 39,962 సంతకాలను సేకరించారు.