తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆస్ట్రేలియా పాఠశాల విద్యార్థులకు 'ధ్యాన' శిక్షణ - విద్యార్థులు

మానసిక ఒత్తిడి, భయం, ఆందోళనలను దూరం చేసి, మానసిక ప్రశాంతతను, ఏకాగ్రతను చేకూర్చే దివ్య యోగప్రక్రియ ధ్యానం. దీని విశిష్టతను గుర్తించిన ఆస్ట్రేలియా పాఠశాలలు... విద్యార్థులకు ధ్యానంలో శిక్షణ ఇస్తున్నాయి. విద్యార్థులూ అమితాసక్తి చూపిస్తున్నారు.

ఆస్ట్రేలియా పాఠశాల విద్యార్థులకు 'ధ్యాన' శిక్షణ

By

Published : Jul 14, 2019, 12:33 PM IST

ఆస్ట్రేలియా పాఠశాల విద్యార్థులకు 'ధ్యాన' శిక్షణ

ధ్యానం.... ప్రశాంత చిత్తం కోసం చేసే ఓ యోగ ప్రక్రియ. ఒత్తిడి నుంచి బయట పడడానికి ఓ అపూర్వ సాధనం. భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన ఈ ధ్యాన ప్రక్రియ నేడు ఖండాంతరాలకు విస్తరిస్తోంది. ఆస్ట్రేలియా తమ దేశ బాలల చేత ధ్యానాన్ని అభ్యాసం చేయిస్తోంది. బ్రిస్బేన్ నగరంలోని ఓ పాఠశాల యాజమాన్యం తమ విద్యార్థులకు ధ్యాన ప్రక్రియపై తర్ఫీదునిస్తోంది.

ఆధునిక విద్యావ్యవస్థలోని చదువుల వల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడిని, భయాన్ని, వారిలోని ఆందోళనలను దూరం చేసి, పాఠ్యాంశాలపై ఏకాగ్రత సాధించడానికి ధ్యానాన్ని ఓ మార్గంగా గుర్తించింది ఈ పాఠశాల. అందుకే నిపుణులను రప్పించి మరీ తమ విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తోంది. పిల్లలు కూడా ఈ ప్రక్రియపై అమితాసక్తి కనబరుస్తూ తర్ఫీదు పొందుతున్నారు.

"ధ్యానం పిల్లలకు తమను తాము పర్యవేక్షించుకోవడానికి, తమను తాము క్రమబద్ధీకరించుకోవడానికి ఉపయోగపడుతుంది. జీవితాన్ని ఎదుర్కోగలిగేలా తయారుచేస్తుంది."
- సారా మైలీ, ఉపాధ్యాయురాలు

గతంలో చదువు పట్ల భయంతో, నిర్లిప్తంగా ఉన్న విద్యార్థుల్లో... ధ్యానాన్ని అభ్యసించిన తరువాత చాలా మార్పు వచ్చిందని, చదువుల్లో రాణిస్తున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. ఇళ్లలోనూ ధ్యానం చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.

" నేను కొన్నిసార్లు రాత్రిపూట కూడా ధ్యానం చేస్తుంటాను."- విద్యార్థి

"ధ్యానం నాలోని ఆందోళనలను రూపుమాపడానికి సహాయపడుతోంది."- విద్యార్థిని

ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని పాఠశాల్లో ధ్యానం చేయించడం ఉపాధ్యాయులకు ఐచ్ఛికంగా ఉంది. అయితే ధ్యానం ప్రాధాన్యం గుర్తించిన అక్కడి ఉపాధ్యాయులు దేశంలోని మిగతా పాఠశాలల్లోనూ దీన్ని ప్రవేశపెట్టాలని అభిప్రాయపడుతున్నారు. ఇందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వమూ సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. పాఠశాలల్లో చిన్నారులకు ఈ తరహా శిక్షణ, వ్యాయామాల కోసం నిధులు కేటాయిస్తోంది.

ఇదీ చూడండి: కర్తార్​పుర్​ నడవాపై భారత్​-పాక్​ చర్చలు

ABOUT THE AUTHOR

...view details