పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్ మృతిచెందారు. ఇస్లామాబాద్ సైనిక ఆసుపత్రిలో శనివారం మరణించినట్లు నిఘావర్గాల సమాచారం. మసూద్ గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో భాదపడుతున్నారు. పాకిస్థాన్ రావల్పిండిలోని ఆర్మీ ఆసుపత్రిలోనూ చికిత్సపొందుతూ మృతి చెందినట్లు సమాచారం. అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
మసూద్ తమదేశంలోనే ఉన్నాడని ఇటీవలే పాకిస్థాన్ ప్రభుత్వం అంగీకరించింది. జైషే మహ్మద్ వ్యవస్థాపకుడి ఆరోగ్యం సరిగా లేదని ఆ దేశ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషి వెల్లడించారు.
భారత్ అంటే గిట్టదు
మసూద్ పూర్తి పేరు మౌలానా మసూద్ అజార్. మన దేశంలో జరిగే ఏ ఉగ్రదాడిలోనైనా పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ హస్తం ఉంటుంది. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడి ఇందుకు ఉదాహరణ.
భారతదేశం అంటే మసూద్‌కు గిట్టదు. కశ్మీర్‌ను భారత్ నుంచి విడగొట్టాలన్న కుట్రతో ఎన్నో ముష్కరదాడులకు నేతృత్వం వహించాడు. 2001లో దిల్లీలోని పార్లమెంటుపై ఆత్మాహుతి దాడి, 2016లో పఠాన్‌కోట్ ఉగ్రదాడి, 2016లోనే ఉరీ సైనికస్థావరంపై దాడి... ఇలా అనేక ఉగ్ర కార్యకలపాలకు మసూద్ సూత్రధారి.
ఒసామా బిన్లాడెన్కు మసూద్ అత్యంత సన్నిహితుడు. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని అఫ్గాన్‌లో హైజాక్ చేశారు ఉగ్రవాదులు. అనంతరం చర్చల్లో భాగంగా మసూద్ అజార్‌ను భారత్ విడిచిపెట్టాల్సి వచ్చింది. మసూద్ విడుదలైన రాత్రే పెద్ద విందు ఇచ్చాడు బిన్‌లాడెన్.
ఐరాస మసూద్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలని ఎన్నో ఏళ్ల నుంచి భారత్ ప్రయత్నిస్తోంది.