తెలంగాణ

telangana

ETV Bharat / international

ఐరాస నిర్ణయాన్ని స్వాగతించిన ప్రపంచదేశాలు - Masoosd Azhar

జైషే మహ్మద్​ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఐరాస నిర్ణయాన్ని అమెరికా, ఫ్రాన్స్​ సహా పలు ప్రపంచ దేశాలు స్వాగతించాయి. అజార్​పై చర్యలు తీసుకోకుండా నాలుగుసార్లు అడ్డుపడిన చైనా ఈసారి అభ్యంతరాలను వెనక్కి తీసుకుంది.

మసూద్​పై ఐరాస నిర్ణయాన్ని స్వాగతించిన ప్రపంచదేశాలు

By

Published : May 2, 2019, 6:36 AM IST

Updated : May 2, 2019, 7:21 AM IST

మసూద్​పై ఐరాస నిర్ణయాన్ని స్వాగతించిన ప్రపంచదేశాలు

భారత్‌లో పదేపదే ఉగ్రదాడులు చేస్తూ రక్తపాతం సృష్టిస్తున్న జైషే మహ్మద్​ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్‌ అజార్‌పై భారత్‌ సుదీర్ఘకాలంగా చేస్తున్న పోరాటం ఫలించింది. మసూద్​ను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. చైనా పలుమార్లు ఈ తీర్మానాన్ని అడ్డుకున్నప్పటికీ అమెరికా, ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌లు తీర్మానానికి మద్దతు పలికినందున చైనా తన అభ్యంతరాలను వెనక్కితీసుకోక తప్పలేదు.

ఐరాస నిర్ణయాన్ని అమెరికా, ఫ్రాన్స్​, బ్రిటన్​ సహా పలు దేశాలు స్వాగతించాయి.​ ఉగ్రవాదానికి వ్యతిరేకంగాపాకిస్థాన్ పోరాడాలని మరోసారి స్పష్టం చేశాయి.

పాక్​ మరిన్ని చర్యలు తీసుకోవాలి : అమెరికా

మసూద్​ అజార్​ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చడాన్ని అమెరికా స్వాగతించింది. అంతర్జాతీయ సమాజానికి ఇచ్చిన హామీలకనుగుణంగా ఉగ్రవాదంపై గట్టి చర్యలు తీసుకోవాలని పాక్​ను కోరింది.

"ఐక్యరాజ్యసమితిలోని దేశాలు మసూద్​ అజార్​ ఆస్తుల జప్తు, విదేశీ ప్రయాణాల నిషేధంతో పాటు జైషే మహ్మద్​ ఉగ్రసంస్థ అధినేతపై మరిన్ని చర్యలు తీసుకునేందుకు ఈ నిర్ణయం చాలా అవసరం. అన్ని దేశాలు ఈ బాధ్యతలను పాటిస్తాయని అనుకుంటున్నాం."
- ఐరాస అమెరికా అధికార ప్రతినిధి

సవరణల అధ్యయనం తరువాతే : చైనా

మసూద్​ అంశంపై సంబంధిత పక్షాలన్నింటితో కొంతకాలంగా సంప్రదింపులు సాగిస్తున్నట్లు చైనా తెలిపింది.

" అమెరికా, బ్రిటన్​, ఫ్రాన్స్​ దేశాలు ఇటీవల తమ ప్రతిపాదనలను సవరించి ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీ ముందుంచాయి. వాటిని జాగ్రత్తగా అధ్యయనం చేసి, సంబంధిత పక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే మసూద్​పై లిఫ్టింగ్​ ప్రతిపాదనకు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు."
- గెంగ్​ షువాంగ్​, చైనా విదేశాంగ అధికార ప్రతినిధి

స్వాగతించిన బ్రిటన్​, ఫ్రాన్స్​

ఐరాస నిర్ణయాన్ని బ్రిటన్​ స్వాగతించింది. మసూద్​ విషయంలో తాము చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయని ఫ్రాన్స్​ పేర్కొంది.

ఆంక్షలు అమలు చేస్తాం : పాక్​

మసూద్​పై ఐరాస విధించిన ఆంక్షలను తాము తక్షణమే అమలు చేస్తామని పాకిస్థాన్​ తెలిపింది. పుల్వామా దాడితో మసూద్​కు ముడిపెట్టడం వంటి రాజకీయ ప్రస్తావనలన్నింటినీ ప్రతిపాదనల నుంచి తొలగించాక అతడిపై ఆంక్షలకు తాము అంగీకరించినట్లు పాక్​ పేర్కొంది.

అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తే ఏమౌతుంది...

ఓ వ్యక్తిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తిస్తే... వివిధ దేశాల్లో ఉన్న అతని ఆస్తులను స్తంభింపచేయవచ్చు. ప్రయాణ నిషేధం కూడా విధిస్తారు. ఆయుధాలు కొనుగోలు చేయడానికీ వీలుండదు. అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన వ్యక్తితో పాటు అతనితో సంబంధమున్న వారి సంస్థల ఆస్తులు, ఆర్థిక వనరులన్నింటినీ తక్షణమే స్తంభింపచేస్తారు.

1999లో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి 1267 తీర్మానాన్ని తాలిబన్లపై ఆంక్షలను విధించేందుకు తీసుకువచ్చింది. కాలక్రమంలో ఇదే తీర్మానాన్ని మానవాళికి తీవ్రనష్టం కలిగిస్తున్న ఉగ్రనేతలపై ప్రవేశపెట్టారు. ఉగ్రవాదసంస్థలపై కూడా అమలు చేస్తున్నారు.

Last Updated : May 2, 2019, 7:21 AM IST

ABOUT THE AUTHOR

...view details