చైనా రాజధాని బీజింగ్‌కు చెందిన ఓ వ్యక్తి 10 నిమిషాల వ్యవధిలో ఒకటిన్నర లీటర్ల కూల్‌డ్రింక్ తాగాడు. ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. తీవ్రమైన కడుపు నొప్పితో గంటల వ్యవధిలోనే బీజింగ్‌లోని చాయంగ్ ఆసుపత్రిలో చేరాడు. 18 గంటల పాటు మృత్యువుతో పోరాడిన ఆ 22ఏళ్ల వ్యక్తి చివరకు ప్రాణాలు విడిచాడు.
అలా 10 నిమిషాల్లో అన్ని లీటర్ల కూల్‌డ్రింక్ తీసుకోవడం వల్ల శరీరంలో గ్యాస్ అమాంతం పెరిగిపోయి కాలేయానికి ఆక్సిజన్ అందకపోవడమే.. అతడి మరణానికి కారణమని వైద్యులు భావిస్తున్నారు. "22ఏళ్ల వ్యక్తికి బీపీ ఒక్కసారిగా పడిపోయింది. గుండె వేగంగా కొట్టుకుంది. ఊపిరి తీసుకోవడం కష్టమైంది. అతడు బతికున్నప్పుడు చేసిన సీటీ స్కాన్‌లో కొన్ని విషయాలు బయటపడ్డాయి. పేగుల్లో గ్యాస్ పేరుకుపోయింది. అక్కడి నుంచి కాలేయంలోని పోర్టల్ వెయిన్(జీర్ణాశయ సిర)కు గ్యాస్ చేరింది. అందువల్ల ఆ ప్రాంతంలో ఆక్సిజన్ స్థాయిలు ఒక్కసారిగా పడిపోయాయి. చివరకు అతడు ప్రాణాలు కోల్పోయాడు" అని వైద్యులు తమ నివేదికలో వెల్లడించారు.
అంతకుముందు వరకు ఆ వ్యక్తికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడం గమనార్హం.