మలేసియా ప్రధాని ముహిద్దీన్ యాసిన్ రాజీనామా చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని నిరూపించుకోలేకపోవడం వల్ల ఆయన రాజీనామా అనివార్యమైంది. ఈ విషయాన్ని అధికారిక పోర్టల్ మలేసియాకిని వెల్లడించింది. కేబినెట్ రాజీనామాను అక్కడి రాజు అల్ సుల్తాన్ అబ్దుల్లాకు సమర్పించినట్లు మంత్రి ఖైరీ జమాలుద్దీన్ ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు. రాజును కలిసిన తరువాత ముహిద్దీన్ యాసిన్ రాజభవనాన్ని వీడినట్లు తెలిపారు.
సంకీర్ణ ప్రభుత్వంలో అంతర్గత పోరుతో మెజారిటీ కోల్పోయారు ముహిద్దీన్. ఆయన రాజీనామాతో దేశంలో ఆర్థిక మాంద్యం, కరోనా కేసులపై మరింత అనిశ్చితి నెలకొంది. అయితే అత్యున్నత పదవిని చేజిక్కించుకునేందుకు నేతలు మద్దతును కూడగడుతున్నారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై రాజు అల్ సుల్తాన్ అబ్దుల్లా నిర్ణయం తీసుకోనున్నారు.