తెలంగాణ

telangana

ETV Bharat / international

మలేసియా మైత్రీ గీతం.. సహకార ఒప్పందంపై సంతకం! - మలేసియా ప్రతిపక్షం

రాజకీయ అస్థిరత నెలకొన్న మలేసియాలో అధికార, ప్రతిపక్ష కూటముల మధ్య సామరస్య ఒప్పందం కుదిరింది. ఓటర్ల అర్హత వయసును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించేలా తక్షణ చట్టం సహా.. పలు అంశాలపై ఇరు వర్గాలు ఓ అవగాహనకు వచ్చాయి.

Malaysia
Malaysia

By

Published : Sep 14, 2021, 5:47 AM IST

మలేసియాలో రాజకీయ అస్థిరత్వం నెలకొన్న నేపథ్యంలో, తన ప్రభుత్వాన్ని సుస్థిరపర్చుకోవడానికి ప్రధాని ఇస్మాయిల్‌ సబ్రి యాకోబ్‌ కీలక అడుగు వేశారు. ప్రతిపక్షంతో పార్లమెంటు సాక్షిగా ఒప్పందం చేసుకున్నారు. అన్వర్‌ ఇబ్రహీం నేతృత్వంలోని ప్రతిపక్షాన్ని సంతృప్తిపరిచేలా పలు సంస్కరణలకు హామీ ఇస్తూ ‘రాజకీయ స్థిరత్వం, పరివర్తన’ ఒప్పందంపై సోమవారం చట్టసభలో సంతకం చేశారు. తద్వారా రెండేళ్లలో జరగనున్న ఎన్నికల వరకూ తన ప్రభుత్వానికి ఢోకా లేకుండా ప్రతిపక్ష మద్దతు కూడగట్టుకున్నారు.

ఫిరాయింపులకు సంస్కరణలతో చెక్‌

మలేసియాలో 2018 ఎన్నికల తర్వాత పార్టీ ఫిరాయింపులు పెరిగి ముగ్గురు ప్రధానులు మారారు. ఈ క్రమంలో ఇస్మాయిల్‌ సంస్కరణల ప్రతిపాదనలు తెచ్చారు. పార్టీ ఫిరాయింపులను నిరోధించడానికి చట్టం తీసుకొస్తానని ప్రతిపక్షానికి హామీ ఇచ్చారు. ప్రధాని పదవీకాలాన్ని 10 ఏళ్లకు తగ్గించేలా చట్టం చేస్తామన్నారు. నూతన బిల్లుల విషయంలో ప్రతిపక్ష ఆమోదాన్ని తప్పనిసరి చేస్తామని, దేశ ఆర్థిక పునరుద్ధరణ కోసం వారి సలహాలు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. కేబినెట్‌ మంత్రి హోదాతో సమానంగా ప్రతిపక్ష నేతకు వేతనం, ఇతర సౌకర్యాలు అందించడానికి అంగీకరించారు. ఓటర్ల అర్హత వయసును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించేలా తక్షణం చట్టం చేస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షం తాజా ఒప్పందానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాన్ని మలేసియా రాజు అబ్దుల్లా సుల్తాన్‌ అహ్మద్‌ షా కూడా ఆహ్వానించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details