తెలంగాణ

telangana

ETV Bharat / international

శక్తిమంతమైన వ్యాక్సిన్‌ దిశగా శాస్త్రవేత్తల ముందడుగు - టీకా రక్షణ

Long immunity vaccine: వ్యాక్సిన్ల రూపకల్పన దిశగా జపాన్ శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. శక్తిమంతమైన వ్యాక్సిన్లు అభివృద్ధి చేసే విధంగా ఓ ప్రాథమిక అంశాన్ని గుర్తించారు. ఈ మెరుగైన టీకాలతో బూస్టర్ డోసులు అవసరం లేకుండానే వ్యాధుల నుంచి దీర్ఘకాల రక్షణ సాధ్యమవుతుందని భావిస్తున్నారు.

JAPAN POWERFUL VACCINE
JAPAN POWERFUL VACCINE

By

Published : Dec 20, 2021, 7:16 AM IST

Updated : Dec 20, 2021, 11:34 AM IST

Long immunity vaccine: పదేపదే బూస్టర్‌ డోసుల అవసరం లేకుండా వ్యాధుల నుంచి దీర్ఘకాల రక్షణ కల్పించే వ్యాక్సిన్ల రూపకల్పన దిశగా జపాన్‌ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. రోగ నిరోధక వ్యవస్థలో దీర్ఘకాల జ్ఞాపకశక్తికి సంబంధించిన ఒక ప్రాథమిక అంశాన్ని వారు గుర్తించారు. దీని ఆధారంగా కొవిడ్‌-19 నుంచి మలేరియా వరకూ అనేక రకాల వ్యాధులకు మెరుగైన వ్యాక్సిన్లను అభివృద్ధి చేయవచ్చని పరిశోధకులు తెలిపారు.

రోగ నిరోధక స్పందన ఇలా..

  • రోగనిరోధక వ్యవస్థలో అనేక రకాల కణాలు ఉంటాయి. తాజా పరిశోధనలో టోక్యో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సీడీ4+ ఫాలిక్యులర్‌ హెల్పర్‌ టి కణాలు, బి కణాలపై ప్రధానంగా దృష్టిసారించారు.
  • ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించినప్పుడు హెల్పర్‌ టి కణాలు రసాయన సంకేతాలను విడుదల చేస్తాయి. అవి.. సంబంధిత ఇన్‌ఫెక్షన్‌ కారక సూక్ష్మజీవిని గుర్తించే విధానంపై అపరిపక్వ బి కణాలకు శిక్షణ ఇస్తాయి. ఈ ప్రక్రియ మొత్తం రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన ప్లీహం, లింఫ్‌ నోడ్‌ వంటి అవయవాల్లోని 'జెర్మినల్‌ సెంటర్‌' అనే తాత్కాలిక కణ నిర్మాణంలో జరుగుతాయి.
  • జెర్మినల్‌ సెంటర్‌లో వృద్ధి చెందిన మెమరీ బి కణాలు.. తొలిసారి దాడి చేసిన సూక్ష్మజీవిని గుర్తుపెట్టుకుంటాయి. మరోసారి అదే జీవి విరుచుకుపడితే.. వేగంగా ప్రతిదాడికి రంగం సిద్ధం చేస్తాయి. దాడి చేసిన వైరస్‌ తన సంఖ్యను పెంచుకునే లోపే నిర్దిష్ట యాంటీబాడీలను ఉత్పత్తి చేయిస్తాయి.
  • వ్యాక్సినేషన్‌ ఉద్దేశం కూడా ఇదే. దీర్ఘకాల యాంటీబాడీల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన అత్యంత నాణ్యమైన మెమరీ బి కణాలను వెలువరించేలా టీకాలు చూడాలి. ఇందుకు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

మలేరియాపై దృష్టి

ఒక వ్యక్తి దోమకాటుకు గురికావచ్చు. ఎన్నిసార్లయినా మలేరియా బారినపడొచ్చు. అయితే మలేరియా కారక పరాన్నజీవి ఏదో ఒక రకంగా మెమరీ బి కణాలను తప్పించుకోగలుగుతోంది. గతంలో ఎన్నిసార్లు మలేరియా ఇన్‌ఫెక్షన్ల బారినపడినప్పటికీ మళ్లీ ఆ వ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురయ్యే ముప్పు కొందరికి పొంచి ఉంటుంది.

ఈ నేపథ్యంలో టోక్యో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మలేరియాపై దృష్టి సారించారు. అలాగే సహజసిద్ధ రోగనిరోధక స్పందనకు సంబంధించిన ప్రాథమిక అంశాలపై నిశితంగా పరిశోధన చేశారు. టీబీకే1 అనే ఎంజైమ్‌ వీరిని ఆకర్షించింది. వైరస్‌ల నుంచి రక్షించే రోగనిరోధక శక్తి కల్పనలో దీనికి పాత్ర ఉన్నట్లు ఇప్పటికే వెల్లడైంది. అయితే టీబీకే1కు బి కణ చర్యలతో ఉన్న సంబంధంపై మాత్రం అవగాహన లేదు.

వెలుగులోకి తెచ్చిన ఎలుకలు

  • తాజాగా జపాన్‌ శాస్త్రవేత్తలు టీబీకే1కు బి కణ చర్యలకు మధ్య ఉన్న బంధాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇందుకోసం వారు బి కణాలు లేదా సీడీ4+ టి కణాల్లో క్రియాశీల టీబీకే1 జన్యువులు లోపించిన ఎలుకలను ప్రత్యేకంగా సృష్టించారు. వీటికి, కొన్ని సాధారణ ఎలుకలకు మలేరియా సోకేలా చేశారు. వాటి నుంచి నమూనాలను సేకరించి విశ్లేషించారు.
  • బి కణాల్లో క్రియాశీల టీబీకే1 ఎంజైమ్‌ కలిగిన మూషికాల్లోనే జెర్మినల్‌ సెంటర్లు ఏర్పడుతున్నట్లు గుర్తించారు. బి కణాల్లో ఈ ఎంజైమ్‌ లేని ఎలుకలు చాలా త్వరగా మలేరియాతో చనిపోయినట్లు తేల్చారు.
  • టీబీకే1 కొన్ని జన్యువులను ఆఫ్‌ చేసే స్విచ్‌లా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. ప్రధానంగా ఇది.. అపరిపక్వ దశలో ఉన్న బి కణాలను అడ్డుకునే జన్యువులను నిర్వీర్యం చేస్తుందని తేల్చారు. దీన్నిబట్టి బి కణాలు జెర్మినల్‌ కేంద్రాలను ఏర్పరిచి, అత్యంత నాణ్యమైన యాంటీబాడీలను ఉత్పత్తి చేయాలంటే ఆ బి కణాల్లో టీబీకే1 ఉండాలని స్పష్టమైంది.
  • ఇదేరీతిలో రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన ప్రాథమిక అంశాలపై మరింత దీర్ఘకాల రక్షణ కల్పించే టీకాలను వృద్ధి చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇదీ చదవండి:ప్రపంచాన్ని ఒమిక్రాన్‌ చుట్టుముడుతోంది..మూడో డోసు తప్పనిసరి!

Last Updated : Dec 20, 2021, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details