ఇరాన్లో కొవిడ్-19 మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఆరు రోజుల పాటు లాక్డౌన్ విధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. లాక్డౌన్లో భాగంగా మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, సినిమా థియేటర్లు, జిమ్‌లు, రెస్టారెంట్లు మూసి ఉంటాయని మీడియా తెలిపింది. సోమవారం ప్రారంభమై శనివారం వరకు ఈ లాక్డౌన్ కొనసాగనుంది. ఈ మేరకు ఇరాన్ జాతీయ కరోనా వైరస్ టాస్క్‌ఫోర్స్ దేశవ్యాప్తంగా ప్రయాణాలపై నిషేధాజ్ఞలు విధించింది.
టీకా పంపిణీలో తడబాటు..
ఇరాన్లో శనివారం ఒక్కరోజే 29,700 కొత్త కేసులు బయటపడగా.. 466 మరణాలు సంభవించాయి. దీనితో దేశంలో మొత్తం కేసులు 4,389,085కి చేరాయి. మరణాల సంఖ్య 97,208కి చేరింది. టీకా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అనేక ప్రయాసలను ఎదుర్కొంటోంది. దేశంలోని 8 కోట్ల మందిలో 3.8 కోట్ల మంది మాత్రమే టీకా రెండు డోసులు అందుకున్నారు.
ఇరాన్ తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే కరోనా నుంచి 85% రక్షణ ఇస్తుందని ప్రకటించింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.